20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:01 PM
భారత స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం బాదింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం బాదింది. ఇందులో ఏడు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇదే శ్రేయాంక తొలి టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 29 బంతుల్లో 71 పరుగులతో ఆమె విధ్వంసం సృష్టించింది. తన బ్యాటింగ్‌తో భారత జట్టు సెలెక్టర్లకు బలమైన సందేశం పంపింది.
ఒకానొక దశలో కర్ణాటక 12.1 ఓవర్లలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాంక ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే శ్రేయాంక పోరాటం వృథా అయింది. ఢిల్లీ జట్టు 17 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో కర్ణాటక సూపర్ లీగ్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా!
శ్రేయాంకకు తాజా ప్రదర్శనలు ఎంతో కీలకంగా మారాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయాంక.. పూర్తి ఫిట్నెస్ సాధించింది. అయితే ఇటీవల జింబాబ్వేతో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన జట్లలోనూ సెలెక్టర్లు ఆమెను పక్కనపెట్టారు. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో చివరిసారిగా ఆమె ప్రాతినిధ్యం వహించింది. అప్పటి నుంచి మళ్లీ సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్-ఎ జట్టుతో జరగనున్న స్వదేశీ సిరీస్ కోసం ప్రకటించిన మూడు భారత-ఎ జట్లలోనూ శ్రేయాంకకు చోటు దక్కింది. టీ20, వన్డే, మల్టీడే ఫార్మాట్లలో ఆమె ఆడనుంది. నవంబర్ 30 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటితే టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు మెరుగుపడవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన అర్ష్‌దీప్ సింగ్
సీఎస్కే ప్లేయర్ అవమానించినా.. ధోనీ భరించాడు: ఆకాశ్ చోప్రా