బుమ్రాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలేమీ లేవు: కివీస్ కెప్టెన్ లాథమ్
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:44 PM
రెండో టెస్టులో బుమ్రాను ఎదుర్కోవడం గురించి న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి బౌలింగ్‌లోని ప్రత్యేకతలను అర్థం చేసుకుంటూ తన సహజమైన ఆటను కొనసాగిస్తానని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే డకౌట్ చేశాడు. దీంతో రెండో టెస్టులో బుమ్రాను ఎదుర్కోవడం గురించి లాథమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి బౌలింగ్‌లోని ప్రత్యేకతలను అర్థం చేసుకుంటూ తన సహజమైన ఆటను కొనసాగిస్తానని తెలిపాడు.
‘జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ సవాలే. కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా అతడిని ఎదుర్కోవడం కష్టమే. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే బంతిని బ్యాటర్‌కు మరింత దగ్గరగా సంధిస్తాడు. అందుకే అతడిని ఎదుర్కోవడం సవాలుగా మారుతుంది. నా దృష్టిలో ఎక్కువ ప్రమాదం కలిగించే బంతిని ఎదుర్కొనేందుకు సరైన రీతిలో సిద్ధం కావడం ముఖ్యం. బంతిని నిశితంగా గమనిస్తూ, అది ఏ వైపు స్వింగ్ అవుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలి. నా ఆటపై నేను దృష్టి పెట్టాలనుకుంటున్నా.
ఒకసారి విఫలమైనప్పుడు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన మన దృష్టిని మరల్చవచ్చు. ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చింది నా ఆటపై ఉన్న స్పష్టతే. టెక్నికల్‌గా కూడా విషయాలను చాలా సులభంగా ఉంచుకోవాలనుకుంటున్నా. పరుగులు చేయడానికి ఏదో అద్భుతమైన పరిష్కారం వెతకడం వల్ల ప్రయోజనం లేదు. క్రికెట్లో అలాంటి మ్యాజిక్ సమాధానం ఏదీ ఉండదు. న్యూజిలాండ్ పరిస్థితుల్లో ఓపెనింగ్ చేయడం చాలా సవాలుతో కూడుకున్నది. ఎంత బాగా సిద్ధమైనా మైదానంలోకి దిగిన తర్వాత ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయని గ్యారంటీ లేదు. గత వారం ఎలా ప్రాక్టీస్ చేశానో ఇప్పుడూ అలాగే చేస్తున్నా. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి జట్టు కోసం నా వంతు పాత్ర పోషించడమే లక్ష్యం’ అని లాథమ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!