Share News

అది టీ20 మ్యాచ్ అనుకున్నా.. వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా!

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:44 AM

భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ రికార్డు డబుల్ సెంచరీపై వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ స్పందించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ 53 బంతుల్లో 204 పరుగులతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

అది టీ20 మ్యాచ్ అనుకున్నా.. వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా!
Chris Gayle

ఇంటర్నెట్ డెస్క్: భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ రికార్డు డబుల్ సెంచరీపై వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ స్పందించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ 53 బంతుల్లో 204 పరుగులతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కోర్ విన్నప్పుడు అసలు తాను సరిగ్గా విన్నానా లేదా అని మరోసారి నిర్ధారించుకున్నట్లు గేల్ వెల్లడించాడు. 12 ఓవర్లలో డబుల్ సెంచరీ అంటే టీ20 మ్యాచ్ అనుకున్నానని, అది 50 ఓవర్ల ఫార్మాట్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాయని తెలిపాడు.


‘15 ఏళ్ల వయసులో తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ సాధించడం అద్భుతం. 28 సిక్సర్లు బాదడం అసాధారణం. ఆ మ్యాచ్ తర్వాత నా ఫోన్‌కు వరుసగా మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది? అని అనుకున్నా. 12 ఓవర్లలో వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేశాడని ఎవరో చెప్పారు. వెంటనే ఇది టీ20 మ్యాచా? అని అడిగాను. కాదు.. 50 ఓవర్ల మ్యాచ్ అని చెప్పారు. 53 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడంటే నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది. ఇదే వేగంతో బ్యాటింగ్ చేస్తే వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమే అనిపిస్తోంది. వైభవ్ ఆటను కొత్త దిశలో తీసుకెళ్తున్నాడు. అతడికి మరిన్ని అవకాశాలు రావాలి. టీమిండియాలో వైభవ్ తరచూ ఆడుతుంటే చూడాలని ఉంది. అతడి ప్రతిభ మరుగున పడకూడదు’ అని గేల్ వివరించాడు.


‘బేబీ బాస్’ ట్యాగ్ వద్దు..

వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌ కారణంగానే క్రిస్ గేల్‌తో పోలుస్తూ అభిమానులు ‘బేబీ బాస్’ అనే పేరు పెట్టారు. గేల్‌ను 'యూనివర్స్ బాస్' అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పేరుతో కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని వైభవ్‌కు గేల్ సూచించాడు. ‘యూనివర్స్ బాస్, బేబీ బాస్ అని పిలుస్తున్నారని తెలుసు. కానీ అతడు తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకోవాలి. ఇతరుల పేర్లకు ట్యాగ్‌లైన్లు జోడించుకోవడం కంటే సొంత బ్రాండ్‌ను నిర్మించుకోవాలి. హిట్‌మ్యాన్, ఏబీ 360, క్రిస్ గేల్ యూనివర్స్ బాస్.. ఇలా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. వైభవ్ కూడా తనదైన బ్రాండ్‌ను సృష్టించుకోవాలి. 'బేబీ బాస్' అనే పేరు ఎక్కువకాలం సరిపోదు. వైభవ్ అంతకు మించి.. భవిష్యత్తులో మరింత ఎదుగుతాడు. అయితే ‘యూనివర్స్’ అనే పేరు మాత్రం తీసుకోలేడు. ఎందుకంటే ఆ యూనివర్స్ నాదే’ అంటూ గేల్ చమత్కరించాడు.


ఇవి కూడా చదవండి:

అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!

Updated Date - Nov 26 , 2026 | 11:45 AM