Sai Sudarshan: టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. విరిగిన పక్కటెముక!
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:56 PM
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో రన్ తీస్తూ కింద పడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున బరిలోకి దిగిన అతడు మధ్యప్రదేశ్‌తో మ్యాచులో రన్ తీస్తూ కిందపడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్లు తెలుస్తోంది. ఈ గాయంతో సుదర్శన్ సుమారు ఆరు వారాలపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశముంది.
తమిళనాడు తరఫున ఆడుతున్న సుదర్శన్‌కు కుడి వైపు పక్కటెముక ముందు భాగంలో స్వల్ప ఫ్యాక్చర్ ఏర్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇటీవల దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుదర్శన్‌కు ఇది ఎదురుదెబ్బగా మారింది. సుదర్శన్ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రికవరీ అవుతున్నాడు.
రిహాబిలిటేషన్ ప్రారంభం
ప్రస్తుతం సుదర్శన్ దిగువ శరీర భాగానికి సంబంధించిన ఫిట్‌నెస్, బలవర్ధక వ్యాయామాలు చేస్తూ పునరావాస చికిత్సలో ఉన్నాడు. గాయమైన రిబ్‌కు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ ఈ వ్యాయామాలు కొనసాగుతున్నాయని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలిపింది. ‘గాయం వల్ల కలిగిన నొప్పి తగ్గిన తర్వాత సుమారు పది రోజుల్లో పై శరీర భాగానికి సంబంధించిన వ్యాయామాలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత క్రమంగా పూర్తి స్థాయి శిక్షణకు తీసుకెళ్తాం’ అని పేర్కొంది.
ఐపీఎల్‌కు వస్తాడా?
సుదర్శన్ నెలకు పైగా ఆటకు దూరమైనప్పటికీ, ఐపీఎల్ 2026 నాటికి పూర్తిగా కోలుకుని మైదానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కీలక ఆటగాడైన సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!