Yograj Singh: ‘అర్జున్ బ్యాటింగ్ సచిన్‌లాగే ఉంటుంది’.. కోచ్‌లపై యోగిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:52 PM
కోచ్‌లపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కోచ్‌లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని విమర్శించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కోచ్‌లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌలింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టి, అసలు అతనిలో ఉన్న బ్యాటింగ్ ప్రతిభను విస్మరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 25 ఏళ్ల అర్జున్ ఒక మంచి బ్యాటర్ అని, అతని ఆటశైలి సచిన్‌ను తలపిస్తుందని యోగ్‌రాజ్(Yograj Singh) వ్యాఖ్యానించారు.
‘అర్జున్(Arjun Tendulkar) బౌలింగ్‌పైనే అందరూ దృష్టి పెడుతున్నారు. కోచ్‌లకు ఏం సమస్యో నాకు అర్థం కావడం లేదు. అసలు అతడు బ్యాటర్. నా అకాడమీలో క్యాంప్‌కు వచ్చినప్పుడు అతన్ని చూసుకోవాలని నన్ను కోరారు. ఒకసారి బంతి తగిలి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు ప్యాడ్స్ వేసుకోమంటే, మ్యాచ్‌ల్లో తనకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం లేదని చెప్పాడు. అతని కోచ్‌ను ‘ఎందుకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం లేదు?’ అని అడిగితే సాకులు చెప్పాడు. అర్జున్ సరైన బ్యాటర్ అని, అతడు తన తండ్రిలాగే ఆడతాడని నేను స్పష్టంగా చెప్పాను’ అని యోగిరాజ్ అన్నారు.
ముంబై ఇండియన్స్ వినలేదు..
‘నా అకాడమీలో వారం రోజుల పాటు బ్యాటింగ్ చేసిన తర్వాతే అర్జున్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో కూడా అర్జున్‌ను ఓపెనర్‌గా పంపించాలని నేను యాజమాన్యాన్ని కోరాను. కానీ వారు పట్టించుకోలేదు’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
2022 డిసెంబరులో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండూల్కర్, రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే శతకం బాదాడు. దీంతో 1988లో గుజరాత్‌పై రంజీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తన తండ్రి సచిన్ రికార్డును అర్జున్ కూడా పునరావృతం చేసినట్లయ్యింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!