Share News

IPL 2026: ‘వికెట్ పల్స్’.. ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చూశారా..?

ABN , Publish Date - Jan 02 , 2026 | 06:44 PM

జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది.

IPL 2026: ‘వికెట్ పల్స్’.. ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చూశారా..?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్, డబ్ల్యూపీఎల్.. లీగ్ ఏదైనా ముంబై ఇండియన్స్‌కు ఉండే ఫాలోయింగే వేరు. జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సారి జెర్సీలో ముంబై నగర వేగాన్ని, సముద్రపు అలల సవ్వడిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.


ముంబై ఇండియన్స్(MI) తాజాగా విడుదల చేసిన జెర్సీలో ఐకానిక్ బ్లూ అండ్ గోల్డ్ రంగులతో పాటు కోరల్ రంగును కూడా జోడించారు. ఈ డిజైన్‌కు ‘వికెట్ పల్స్’ అని పేరు పెట్టారు. ముంబై లోకల్ ట్రైన్ల వేగం, అరేబియా సముద్రపు అలల కదలికల నుంచి ఈ డిజైన్‌ను రూపొందించినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ జెర్సీ కేవలం ఒక యూనిఫామ్ మాత్రమే కాదని, ముంబై ప్రజల సంకల్పానికి, ముంబై ఇండియన్స్ పోరాట పటిమకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.


ఈ సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తమ కోర్ టీమ్‌ను నిలబెట్టుకుంది. జట్టులో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.50 కోట్లు) నిలవగా, న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్ (రూ.3 కోట్లు) రెండో స్థానంలో ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.2.50 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. వీరితో పాటు సౌతాఫ్రికా స్పీడ్ గన్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ వంటి కీలక ఆటగాళ్లతో ముంబై టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది.


డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. 2023లో జరిగిన మొదటి ఎడిషన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, గత ఏడాది (2025) జరిగిన మూడో ఎడిషన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో రెండుసార్లు కప్పు కొట్టిన ఏకైక జట్టు ముంబై మాత్రమే. ఇప్పుడు 2026 సీజన్‌లో కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే దిశగా సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!

వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!

Updated Date - Jan 02 , 2026 | 06:44 PM