పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
ABN , Publish Date - May 26 , 2026 | 07:46 AM
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్ ఈ పురస్కారాన్ని అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్ ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రెండు పద్మ విభూషణ్‌లు, ఆరు పద్మ భూషణ్‌లు, 58 పద్మశ్రీ అవార్డులను అందించారు. 2026 సంవత్సరానికి మొత్తం 131 పద్మ పురస్కారాలకు కేంద్రం ఆమోదం లభించింది. వీటిలో ఐదు పద్మ విభూషణ్‌లు, 13 పద్మ భూషణ్‌లు, 113 పద్మశ్రీలు ఉన్నాయి. మిగిలిన గ్రహీతలను రెండో విడతలో సత్కరించనున్నారు.
2025లో స్వదేశంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించింది. నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన మొట్టమొదటి కెప్టెన్‌గా హర్మన్ నిలిచింది. అలాగే స్వదేశంలో ప్రపంచ కప్‌ను గెలిపించిన భారత కెప్టెన్లలో ఎంఎస్ ధోని తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కాగా 2011 వన్డే ప్రపంచ కప్‌ను ధోని నాయకత్వంలోనే టీమిండియా అందుకున్న సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ తన కెరీర్‌లో 164 వన్డేల్లో 4,541 పరుగులు చేసింది. ఇందులో 7 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. టీ20ల్లో 195 మ్యాచ్‌ల్లో 3,991 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 16 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టు ఫార్మాట్‌లో కూడా తనదైన ముద్ర వేసింది.
వీరికి కూడా..
పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. టోక్యో పారా ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అతడు.. ఆ తర్వాత పారిస్ పారా ఒలింపిక్స్‌లో 2.08 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు. మహిళల హాకీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన సీనియర్ కోచ్ బల్‌దేవ్ సింగ్‌కు కూడా ఈ గౌరవం దక్కింది. ఆయన శిక్షణలో 80 మందికి పైగా అంతర్జాతీయ క్రీడాకారులు ఎదిగారు.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!