Share News

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

ABN , Publish Date - May 26 , 2026 | 02:42 AM

ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్‌-19 సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆ్‌ఫ్సలో చోటు కోసం ప్రతీ జట్టు హోరాహోరీగా తలపడడంతో చివరి మ్యాచ్‌ వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం...

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

నేడు తొలి క్వాలిఫయర్‌లో

బెంగళూరు X గుజరాత్‌

రాత్రి 7.30 నుంచి, స్టార్‌స్పోర్ట్స్‌లో

ఇక ప్లేఆఫ్స్‌ ధమాకా

గెలిచిన జట్టు నేరుగా తుదిపోరుకు

ఓడిన టీమ్‌కు మరో చాన్స్‌

ధర్మశాల: ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్‌-19 సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆ్‌ఫ్సలో చోటు కోసం ప్రతీ జట్టు హోరాహోరీగా తలపడడంతో చివరి మ్యాచ్‌ వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం. ఇక నేటి నుంచి అసలైన సమరం ఆరంభం కానుంది. టైటిల్‌ను దక్కించుకునేందుకు టాప్‌-4 జట్ల మధ్య మంగళవారం నుంచి క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ధర్మశాలలో జరిగే తొలి క్వాలిఫయర్‌ 1లో మంగళవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్‌ (రాజస్థాన్‌-సన్‌రైజర్స్‌) విజేతతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్‌సీబీ-టైటాన్స్‌ రెండూ 9 విజయాలు, 5 ఓటములు 18 పాయింట్లతో సమానంగానే ఉన్నాయి. కానీ స్వల్ప నెట్‌రన్‌రేట్‌ తేడాతో ఆర్‌సీబీ టాపర్‌గా నిలిచింది. మరోవైపు ధర్మశాలలో గుజరాత్‌ జట్టు తమ కెరీర్‌లో తొలిసారిగా బరిలోకి దిగబోతోంది.

సాల్ట్‌ ఆడేనా?

బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్‌సీబీని ఓపెనింగ్‌ సమస్య వెంటాడుతోంది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఫిల్‌ సాల్ట్‌ రెండు హాఫ్‌ సెంచరీలతో 202 పరుగులు చేశాడు. అయితే గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన బెథెల్‌ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 96 పరుగులే సాధించి దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఇటీవలే జట్టులో చేరిన సాల్ట్‌ కీలక క్వాలిఫయర్‌1కు ఫిట్‌గా ఉంటే సమస్య తీరినట్టే. సన్‌రైజర్స్‌పై విరాట్‌తో కలిసి ఆడిన వెంకటేశ్‌ అయ్యర్‌ 19 బంతుల్లో 44 రన్స్‌ చేశాడు. ఒకవేళ సాల్ట్‌ ఆడలేకపోతే అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించవచ్చు. పైగా ఈనెల 17న ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో తను 73 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఇక విరాట్‌ 157.83 స్ట్రయిక్‌ రేట్‌తో 554 పరుగులు సాధించి ఊపు మీదున్నాడు. దేవ్‌దత్‌, రజత్‌, టిమ్‌ డేవిడ్‌, క్రునాల్‌లతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ అత్యంత పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌, రసిఖ్‌లతో పేస్‌ త్రయం ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగలదు. భువీ ఇప్పటికే 24 వికెట్లు తీయడం విశేషం.


ఓపెనర్లు బలంగా..

గుజరాత్‌ టైటాన్స్‌ బలమంతా ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఆటతీరుపైనే ఉందనడంలో సందేహం లేదు. అద్భుతమైన నిలకడతో వీరిద్దరు ఈ సీజన్‌లో 600+ చొప్పున రన్స్‌తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ జోడీ ఐపీఎల్‌లోనే బెస్ట్‌ అంటూ మాజీలు కితాబిస్తున్నారు. ఆడిన 46 ఇన్నింగ్స్‌లో 21సార్లు 50+ భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. ఇక నేటి పోరులోనూ వీరే కీలకం కానున్నారు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ బట్లర్‌, సుందర్‌ల ఎదురుదాడితో భారీ స్కోరుపై టైటాన్స్‌ కన్నేసింది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ రాకతో జట్టుకు విజయాలు పెరిగాయి. పేసర్లు రబాడ, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మధ్య ఓవర్లలో ఆర్‌సీబీని కట్టడి చేయాలనుకుంటున్నాడు.

తుది జట్లు

బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, సాల్ట్‌/వెంకటేశ్‌ అయ్యర్‌, దేవ్‌దత్‌, రజత్‌ పటీదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, షెఫర్డ్‌, టిమ్‌ డేవిడ్‌, క్రునాల్‌, భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌, రసిఖ్‌ సలామ్‌.

గుజరాత్‌: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, బట్లర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హోల్డర్‌, తెవాటియా, నిశాంత్‌ సింధు, రషీద్‌ ఖాన్‌, అర్షద్‌ ఖాన్‌, రబాడ, సిరాజ్‌.

పిచ్‌, వాతావరణం

ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 200 దాటింది. అందుకే క్వాలిఫయర్‌ 1లోనూ పరుగుల వరద ఖాయమే. ఇక రెండుసార్లు ఛేజింగ్‌ జట్టే గెలవడంతో టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే పేసర్లకు కూడా పిచ్‌ నుంచి కాస్త సహకారం లభించవచ్చు.

ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

Updated Date - May 26 , 2026 | 02:42 AM