Share News

తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటిల్

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:10 PM

భారత యువ షట్లర్ తన్వి శర్మ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఈ యువ సంచలనం మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్ ఎంగుయెన్‌ను 21-16, 21-16తో వరుస గేమ్‌లలో ఓడించింది.

తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటిల్
Tanvi Sharma

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ షట్లర్ తన్వి శర్మ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఈ యువ సంచలనం మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్ ఎంగుయెన్‌ను 21-16, 21-16తో వరుస గేమ్‌లలో ఓడించింది. దీంతో తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2008లో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సాధించిన విజయానంతరం.. 18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన రెండో భారతీయురాలిగా తన్వి నిలిచింది.


మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తన్వి.. చాకచక్యమైన షాట్లు, క్రాస్‌కోర్ట్ స్మాష్‌లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌ను 21-16తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో గట్టి పోటీనిచ్చిన ఎంగుయెన్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయినా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తన్వి అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లు సాధించింది. చివరకు 21-16తో రెండో గేమ్‌నూ గెలిచి కేవలం 36 నిమిషాల్లోనే టైటిల్‌ను ఖరారు చేసుకుంది.


ప్రపంచ మాజీ జూనియర్ నంబర్‌ వన్ అయిన తన్వి శర్మ గత రెండేళ్లుగా జూనియర్, సీనియర్ స్థాయిల్లో ఆకట్టుకుంటోంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్-300 ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన ఆమె, ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోలేదు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ శిక్షణలో రాటుదేలిన తన్వి, పతక ప్రదానోత్సవం అనంతరం తన స్వర్ణ పతకాన్ని కోచ్ మెడలో వేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!

దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్

Updated Date - Aug 02 , 2026 | 01:10 PM