టీ20 ప్రపంచ కప్: అచ్చిరాని అహ్మదాబాద్‌లో.. గొప్ప రికార్డే లేని కివీస్‌పై! టీమిండియా కప్పు కొడుతుందా?
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:16 PM
టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో ఈ ఇరు జట్ల ప్రదర్శనలు గతంలో ఎలా ఉన్నాయంటే..!
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తుది పోరులో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతూనే ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 253 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. టీమిండియా కేవలం 7 పరుగుల తేడాతోనే గెలిచింది.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ ఫామ్ లేమి, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తేలిపోతుండటం, దూబే ధారాళంగా పరుగులివ్వడం, ఫీల్డింగ్ లోపాలు వంటి సమస్యలు భారత జట్టుకు శాపంగా మారాయి. మరోవైపు సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో ఈ ఇరు జట్ల ప్రదర్శనలు గతంలో ఎలా ఉన్నాయంటే..!
ప్రపంచ కప్ టోర్నీలో.. కివీస్!
టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఆ మూడింట్లోనూ న్యూజిలాండ్ జట్టే విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై భారత్ ఓ అత్యధికంగా 180 పరుగులు చేయగా.. అత్యల్పంగా 79 పరుగులు చేసింది. టీమిండియాపై న్యూజిలాండ్ అత్యధికంగా 190 పరుగులు చేయగా.. అత్యల్పంగా 79 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మెగా టోర్నీ చరిత్రలో కివీస్‌పై టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ గణాంకాలు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. మరి ఈ సారి అచ్చిరాని అహ్మదాబాద్ స్టేడియంలో.. అస్సలు గొప్ప రికార్డు లేని న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా పోరాడి గెలిచి నిలుస్తుందా? వరుసగా రెండో సారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా? అనేది చూడాల్సి ఉంది.
అయితే టీ20 ఫార్మాట్లో కివీస్‌పై టీమిండియాదే పైచేయి. అభిమానులకు ఈ విషయం కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 30 టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్‌లు గెలిస్తే.. న్యూజిలాండ్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో భాగంగా కివీస్‌పై అభిషేక్ శర్మకు మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడతున్న అభిషేక్.. ఈ మ్యాచ్‌తో తిరిగి పుంజుకునే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. టీమిండియా విజయం లాంఛనమే. మరి కివీస్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం
ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత్ 198 పరుగులకు ఆలౌట్