Share News

హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం హమీద్‌ ఇకలేరు

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:30 AM

భారత ఫుట్‌బాల్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఒలింపియన్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హబీబల్‌ హసన్‌ హమీద్‌ (85) అనారోగ్యంతో....

హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం హమీద్‌ ఇకలేరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత ఫుట్‌బాల్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఒలింపియన్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హబీబల్‌ హసన్‌ హమీద్‌ (85) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం కన్నుమూసిన హమీద్‌ అంత్యక్రియలను నగరంలోని విజయనగర్‌ కాలనీలో నిర్వహించారు. హమీద్‌కు కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య కొన్నాళ్ల కిందటే అనారోగ్యంతో మృతి చెందారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో ఆడిన భారత జట్టులో హమీద్‌ సభ్యుడు. అప్పటికి అతని వయసు 19 ఏళ్లు. ఈ క్రమంలో రోమ్‌ విశ్వక్రీడల్లో పోటీపడ్డ నాటి భారత జట్టులో పిన్న వయస్కునిగా హమీద్‌ రికార్డుకెక్కారు. ఇక, 1960 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ ఆడారు. ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్‌ తరఫున పోటీపడ్డ మొత్తం 14 మంది హైదరాబాదీ ఆటగాళ్లలో హమీద్‌ ఒకరు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, భువనగిరిలో 1941లో జన్మించిన హమీద్‌.. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఫార్వర్డ్‌ ఆటగాడిగా పేరొందిన హమీద్‌.. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, లతీఫ్‌ వంటి భారత దిగ్గజాలతో కలిసి ఆడాడు. హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌, హైదరాబాద్‌ పోలీస్‌, మహ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ (కోల్‌కతా), దక్షిణ మధ్య రైల్వే జట్లకు అతను ప్రాతినిథ్యం వహించారు. హమీద్‌ కెరీర్‌లో కోచ్‌ ఎస్‌.ఎ రహీం పాత్ర చాలా కీలకమైనది. అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఖ్యాతి ఇప్పుడు పతనవాస్థలో ఉందంటూ తన చివరి రోజుల్లో హమీద్‌ చాలా బాధపడేవారని అతని సన్నిహితులు తెలిపారు. హమీద్‌ మృతిపై భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌, తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫాల్గుణ సంతాపం తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 03:30 AM