Share News

టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:55 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ప్రయాణం ఆసక్తికర మలుపులతో సాగుతోంది. బ్యాటింగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నప్పటికీ ఫీల్డింగ్‌లో ముఖ్యంగా క్యాచ్‌ల విషయంలో టీమిండియా కొంతకాలం తడబడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ప్రయాణం ఆసక్తికర మలుపులతో సాగుతోంది. బ్యాటింగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నప్పటికీ ఫీల్డింగ్‌లో ముఖ్యంగా క్యాచ్‌ల విషయంలో టీమిండియా కొంతకాలం తడబడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. లీగ్ దశ నుంచి సూపర్ 8 వరకు భారత జట్టు క్యాచింగ్ ఎఫిషియన్సీ కేవలం 71.7 శాతం మాత్రమే.. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో మాత్రం అత్యద్భుతంగా 100 శాతానికి చేరుకుంది.


టోర్నమెంట్ తొలి దశల్లో టీమిండియా మొత్తం 13 కీలక క్యాచ్‌లు డ్రాప్ చేసింది. దీంతో సూపర్ 8 దశకు చేరుకున్న జట్లలో భారత్ చివరి స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఇంగ్లండ్, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు 80 శాతానికి పైగా క్యాచింగ్ ఎఫిషియన్సీతో మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శించాయి. మ్యాచ్‌లను గెలిపించే కీలక క్షణాల్లో క్యాచ్‌ డ్రాప్ చేయడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.


సెమీ ఫైనల్లో మాత్రం..

సెమీఫైనల్‌కు వచ్చే సరికి భారత జట్టు పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత ఫీల్డర్లు అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్.. అద్భుతంగా క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ వేసిన 14వ ఓవర్లో ఫుల్‌టాస్‌గా వచ్చిన చివరి బంతికి జాక్స్ కవర్స్‌లో భారీ షాట్ ఆడాడు. చాలా దూరం నుంచి పరుగెత్తుకుని వచ్చిన అక్షర్.. అద్భుత రీతి బంతిని అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద తనను తాను నియంత్రించుకోలేకపోయిన అక్షర్.. చురుగ్గా స్పందించి తన ముందే ఉన్న దూబె వైపు బంతి విసరగా అతడు క్యాచ్ పట్టాడు. దీంతో బెతెల్, జాక్స్ విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. ఇలాంటి క్యాచ్‌లు టీమిండియా నిన్న బోలెడు తీసుకుంది. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్ క్యాచింగ్ ఎఫిషియన్సీ దాదాపు 100 శాతంగా నమోదైంది.


వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. లీగ్ దశలో విమర్శలు ఎదుర్కొన్న ఫీల్డింగ్ విభాగం.. సెమీఫైనల్‌లో మాత్రం జట్టుకు బలంగా మారింది. ఇదే ఫైనల్‌లో కూడా కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Mar 06 , 2026 | 05:55 PM