Share News

టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:14 PM

టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి. కేవలం ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి మాత్రమే కాకుండా.. సభ్య దేశాలకు గట్టి పోటీనిచ్చే దిశగా సాగుతున్నాయి. ఒకప్పుడు స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఒమన్, నేపాల్, యూఏఈ వంటి జట్లను ప్రపంచ కప్‌లో కేవలం నామమాత్రపు జట్లుగానే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నెదర్లాండ్స్‌కు పెద్ద జట్లపై గెలుపు కొత్తేమీ కాదు. 2024లో పాకిస్థాన్‌ను ఓడించి టోర్నీ నుంచే బయటకు నెట్టిన అమెరికా విజయం వారి క్రికెట్ చరిత్రలో మైలురాయి.


‘మేము టోర్నీలో దేశాల సంఖ్య పెంచడానికి రాలేదు.. గట్టి పోటీనివ్వడానికి వచ్చాం..’ ఇవి ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ మాటలు. అతడి నాయకత్వంలో వరల్డ్‌ కప్‌లో తొలిసారి బరిలోకి దిగిన ఇటలీ.. కెనడాను 10 పరుగులు, యూఏఈని ఏకంగా 112 పరుగులతో ఓడించి సంచలనం సృష్టించింది. నేపాల్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రూప్ స్టేజిలో రెండు సార్లు ఛాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. నేపాల్‌తో మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆ జట్టును నేపాల్ ఎంతలా వణికించిందో!


పాకిస్థాన్‌ను భయపెట్టిన నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ అతి కష్టం మీద గెలిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో.. నెదర్లాండ్స్ బౌలర్ ఓ కీలక క్యాచ్ జారవిడవడం.. చివర్లో ఫహీమ్ అష్రఫ్ (29, 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టడంతో పాకిస్థాన్‌ ఓటమి ముప్పు నుంచి గట్టెక్కింది.


స్కాట్లాండ్, అమెరికా కూడా..

ఇక స్కాట్లాండ్.. వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా183 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగింది. 40 బంతుల్లో 67 పరుగులు కావాలి. దాదాపు గెలుపు స్కాట్లాండ్‌దే అనుకున్నారంతా. రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్‌తో మ్యాచ్ దిశ మారింది. గెలుపు వెస్టిండీస్‌ను పలకరించింది. అదే రోజు వాంఖడే వేదికగా భారత్‌పై అమెరికా అసాధారణ ప్రదర్శన.. టీమిండియా అభిమానులకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. విధ్వంసకర బ్యాటర్లంతా అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలిపోయారు. 77 పరుగుల వద్ద భారత్‌.. ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84*) ఒంటరి పోరాటం చేయడంతో అమెరికా ఓటమి లాంఛనమైంది. 29 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.


ప్రపంచ కప్ 2026 ఇంకా ఆరంభ దశలోనే ఉంది. అయినా అసోసియేట్ జట్లు ఈ టోర్నీలో తమ పాత్రపై స్పష్టమైన సందేశం ఇచ్చాయి. ఇక నుంచి వారిపై గెలుపు సులభం కాదు. సభ్య దేశాలపై వారి విజయాలు సాధారణమేనని భావించే స్థాయికి క్రికెట్ చేరుకుంటోంది. కాబట్టి సభ్య దేశాలు కూడా జాగ్రత్త పడాల్సిన రోజులొచ్చాయి.


Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

Updated Date - Feb 10 , 2026 | 04:41 PM