భారత్-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన విమాన టికెట్ ధరలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:06 PM
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా.. పాక్ యూటర్న్ తీసుకుని భారత్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిమిషాల వ్యవధిలో విమానాల టికెట్ ధరలు పెరిగిపోయాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Mens T20 World Cup) షెడ్యూల్‌లో భాగంగా.. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో తాము మ్యాచ్ ఆడతామని పాక్ ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే ముంబై నుంచి కొలంబోకు రౌండ్ ట్రిప్ విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. క్షణాల వ్యవధిలో ఈ టికెట్ ధర రూ.10వేల వరకు ఎగబాకింది. ప్రస్తుతం.. ముంబై - కొలంబో- ముంబై రౌండ్ టికెట్ ధర దాదాపు రూ.60 వేలుగా ఉందని సమాచారం. భారత్‌లోని ఇతర నగరాల నుంచి కూడా కొలంబోకు వెళ్లే విమాన టికెట్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చినట్టు తెలుస్తోంది.
ప్రపంచ కప్(World Cup 2026)ప్రారంభానికి ముందు భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ భీష్మించుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా సోమవారం పాక్.. యూటర్న్ తీసుకుంది. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఐసీసీతో జరిగిన చర్చల అనంతరం వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?