టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:07 PM
టీ20 ప్రపంచ కప్2026 వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టోర్నీలకు భారత ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్-2026 జరుగుతోంది. ఇదే సమయంలో వివిధ క్రికెట్ బోర్డుల నుంచి కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. భారత్ తో మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలానే టోర్నీ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌కు ఊరటనిచ్చే నిర్ణయాలను ఐసీసీ తీసుకుంది. మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అది కూడా భారత్ ప్లేయరకు సంబంధించిన అంశమని తెలుస్తోంది. ఐసీసీ మెగా టోర్నీ వేళ ఆటగాళ్లతో వారి కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
విదేశీ పర్యటనలో 45 రోజుల కంటే ఎక్కువ ఉంటే క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతిచ్చింది. అయితే, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్(Australia) చేతిలో 3-1తో భారత్ జట్టు ఓడింది. దీంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొందరు ఆటగాళ్లు కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తూ పలు సందర్భాల్లో సమావేశాలకు కూడా గైర్హాజరు కావడంతో ఇకపై విదేశీయ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై భారత జట్టు యాజమాన్యం.. బోర్డును సంప్రదించినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది.
'ప్లేయర్లు తమ భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని టీమిండియా మేనేజ్‌మెంట్ బీసీసీఐని అడిగింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని బోర్డు స్పష్టం చేసింది. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని, అది కూడా వారు కోరితే మాత్రమే ఈ సదుపాయాలు ఉంటాయని తెలిపింది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో భారత్ జట్టు బిజీగా ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్ దశలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లో సొంతగడ్డపై.. పాకిస్థాన్‌తో మ్యాచ్ కొలంబోలో ఆడుతుంది.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?