భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:55 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. పాక్ ప్రధాని నిర్ణయం మేరకు యథావిథిగా మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా గ్రూప్ స్టేజిలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని బెట్టు చేసిన పాక్ చివరికి మెట్టు దిగొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో.. పాక్ మ్యాచ్ ఆడకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు.. పీసీబీని అభ్యర్థించింది. తమ అభ్యర్థనతో పాక్ నిర్ణయం మార్చుకున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే(Anura Kumar Dissanayake) పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇచ్చినందుకు థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్. టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం కొలంబోలో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ టోర్నమెంట్‌కు సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక.. ఐసీసీ ప్రయత్నాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తోంది. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాల వల్ల ఇతర దేశాలు దూరంగా ఉన్నప్పుడు భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలో ఆడటం ద్వారా చూపిన సంఘీభావాన్ని శ్రీలంక ఎప్పటికీ మర్చిపోలేదు’ అని శ్రీలంక అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!