సిరాజ్‌ను తీసుకోవాల్సింది.. అశ్విన్‌తో ఏకీభవించని గావస్కర్.. అసలేం జరిగిందంటే?
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:41 AM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆకాష్ దీప్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తలకు గాయం కావడంతో మ్యాచ్‌కు దూరమైన ఆకాష్ దీప్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై స్పందించాడు. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే గావస్కర్ వ్యాఖ్యలతో మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకీభవించకపోవడం గమనార్హం.
సిరాజ్‌ను తీసుకోవాల్సింది: గావస్కర్
‘కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా సిరాజ్‌ను తీసుకోవాల్సింది. అతడు తొలి టెస్టులో కూడా ఆడలేదు. కాబట్టి అతడికి మరింత విశ్రాంతి లభించింది. న్యూజిలాండ్ పిచ్‌లపై సిరాజ్‌కు మంచి రికార్డే ఉంది. ఇలాంటి కీలక సమయంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకొచ్చి ఉంటే.. ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉండేవి. తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ న్యూజిలాండ్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడని అనిపించింది. ఈ పిచ్‌పై సిరాజ్ బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ ఎదురయ్యేది’ అని గావస్కర్ వెల్లడించాడు.
ప్రసిద్ధ్ కృష్ణనే సరైన ఎంపిక: అశ్విన్
మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించాడు. సిరాజ్‌ను మ్యాచ్ మధ్యలో తీసుకొస్తే వెంటనే ప్రభావం చూపడం కష్టమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పుడు ఇప్పటికే ఆ సిరీస్‌లో ఆడిన ఆటగాడిని తీసుకోవడం మంచిది. సిరాజ్ తొలి టెస్టులో ఆడలేదు. రిథమ్‌లో లేడు. ఇప్పుడు మ్యాచ్ మధ్యలో వచ్చి వెంటనే ప్రభావం చూపడం కష్టమవ్వొచ్చు’ అని అశ్విన్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోర్ 133/3
వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. ధోనీ రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్