Share News

నో బాల్స్ వివాదం.. బౌలర్‌తో పాటు కోచ్‌కు కూడా శిక్ష పడాల్సిందే: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:14 PM

బౌలర్లు పదే పదే నోబాల్స్‌ వేయడంపై భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తీవ్రంగా స్పందించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అత్యధిక సార్లు నో బాల్స్ వేసిన సంగతి తెలిసిందే.

నో బాల్స్ వివాదం.. బౌలర్‌తో పాటు కోచ్‌కు కూడా శిక్ష పడాల్సిందే: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: బౌలర్లు పదే పదే నోబాల్స్‌ వేయడంపై భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తీవ్రంగా స్పందించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అత్యధిక సార్లు నో బాల్స్ వేసిన సంగతి తెలిసిందే. బౌలర్ల ఓవర్‌స్టెప్పింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని గావస్కర్ సూచించాడు.


‘భారత బౌలర్లు వేసిన నోబాల్స్‌పై చాలా చర్చ జరిగింది. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చగలదు. ఆటగాళ్ల నియంత్రణలో ఉండే అంశాలు చాలా తక్కువ. బ్యాటర్‌ గార్డ్‌ తీసుకోవడం, బౌలర్‌ నోబాల్‌ వేయకుండా ఉండటం వాటిలో ముఖ్యమైనవి. ఇప్పుడు రన్‌ప్‌ను కొలిచేందుకు టేప్‌ కూడా అందుబాటులో ఉంది. అలాంటప్పుడు బౌలింగ్‌ క్రీజును దాటడానికి ఎలాంటి సాకులు ఉండకూడదు. పదే పదే నో బాల్ వేసే బౌలర్లకు జరిమానా విధించాలి. ఆ మొత్తాన్ని ప్రతిసారి రెట్టింపు చేయాలి. బౌలింగ్ కోచ్‌కు కూడా శిక్ష పడాలి. బౌలర్‌పై వేసిన ఫైన్‌లో సగం కోచ్ కట్టాలి. అలా వసూలు అయిన డబ్బును.. సిరీస్ ముగిశాక జట్టు డిన్నర్ కోసం ఖర్చుపెట్టాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.


ఫ్రీ హిట్‌ వద్దు..

నోబాల్‌ తర్వాత ఫ్రీహిట్‌ ఇస్తే బౌలర్లు ఓవర్‌స్టెప్పింగ్‌ తగ్గిస్తారన్న భారత స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే సరదా సూచనను గావస్కర్‌ తిరస్కరించాడు. ‘టెస్టు క్రికెట్‌లో బ్యాటర్లకు పరుగులు చేయడం మరింత సులభం చేసేలా ఫ్రీ హిట్‌ ఇవ్వొద్దు. ఇప్పటికే ఓవర్‌లో రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీల పరిమాణం తగ్గడం వంటి కారణాలతో పరుగులు చేయడం కొంత సులభమైంది. కాబట్టి ఫ్రీ హిట్‌ అవసరమే లేదు’ అని స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా కప్: పాకిస్థాన్‌తో హ్యాండ్ షేక్ వివాదం.. కోచ్ అమోల్ ఏమన్నారంటే?

మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్

Updated Date - Aug 30 , 2026 | 12:14 PM