Share News

అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:07 AM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. సంజును జట్టు నుంచి తప్పిస్తున్న విషయాన్ని చెప్పడం తనకు ఎంత కష్టంగా అనిపించిందో వెల్లడించాడు. అదే సమయంలో సంజు ఇచ్చిన సమాధానం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.

అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు విజేతగా నిలవడంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే టోర్నీ ఆరంభానికి ముందు అతడు జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో పేలవ ఫామ్‌ కారణంగా శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించి.. ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. సంజును జట్టు నుంచి తప్పిస్తున్న విషయాన్ని చెప్పడం తనకు ఎంత కష్టంగా అనిపించిందో వెల్లడించాడు. అదే సమయంలో సంజు ఇచ్చిన సమాధానం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.


‘అప్పుడు మేము బస్సులో ఉన్నాం. పరిస్థితిని చూస్తుంటే నీకు కష్టంగా ఉండబోతోందని సంజుతో చెప్పాను. అప్పుడు అతడు ఒక్కటే మాట అన్నాడు. ‘ప్రపంచకప్‌ గెలవడానికి జట్టుకు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి’ అని చెప్పాడు. అవసరం వచ్చినప్పుడు తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు. సంజు జట్టులో లేకపోయినా ఆడబోతున్నట్టుగానే సిద్ధమవుతానన్నాడు. అది విన్న తర్వాత నాలో చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవితంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపించింది’ అని సూర్యకుమార్‌ చెప్పాడు.


అప్పుడే సంజుకు మాటిచ్చా..

‘2024లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు సంజు పెద్దగా పరుగులు చేయలేదు. ఏం చేయాలని నన్ను అడిగాడు. అప్పట్లో అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ ఆడుతున్నాం. నేను అతడిపై నమ్మకం ఉందని చెప్పాను. కోచ్‌ కూడా అతడిపై నమ్మకం ఉంచాడని చెప్పాను. తర్వాతి మ్యాచ్‌ల్లో సంజుకి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాను. ఏడు మ్యాచ్‌ల్లో అన్నిసార్లు డకౌట్ అయినా.. ఎనిమిదో మ్యాచ్‌లోనూ అతడే ఆడతాడని చెప్పాను’ అని సూర్య వివరించాడు.


తిరిగొచ్చాక దుమ్మురేపాడు..

టీ 20 ప్రపంచ కప్ సూపర్‌-8 దశలో భారత తుది జట్టులోకి తిరిగి వచ్చిన సంజు.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వెస్టిండీస్‌తో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌, ఫైనల్లోనూ వరుసగా 89 పరుగులు చేసి భారత్‌ ప్రపంచకప్‌ విజయంలో కీలకంగా నిలిచాడు. చివరకు టోర్నీలో అత్యుత్తమ ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా కప్: పాకిస్థాన్‌తో హ్యాండ్ షేక్ వివాదం.. కోచ్ అమోల్ ఏమన్నారంటే?

మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్

Updated Date - Aug 30 , 2026 | 11:07 AM