కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:14 PM
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన హీట్స్‌లో శ్రీహరి 25.52 సెకన్లలో రేసును పూర్తి చేసి సంయుక్తంగా 14వ స్థానంలో నిలిచాడు. బెర్ముడాకు చెందిన జాక్ హార్వేతో సమాన సమయాన్ని నమోదు చేసిన నటరాజ్.. టాప్-16లో చోటు దక్కించుకుని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఈ హీట్‌లో శ్రీహరి ఐదో స్థానంలో నిలిచాడు. రెండు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ భారత స్విమ్మర్.. ఇప్పటికే పలు జాతీయ రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
పారా స్విమ్మింగ్‌లో ఫైనల్‌కు..
పారా స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో భారత క్రీడాకారులు ఆర్‌వీవీబీకే బుడిగినా, ఇమామ్ అలీ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ విభాగంలో హీట్స్‌లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లూ ఫైనల్‌కు చేరడం విశేషం. బుడిగినా 57.10 సెకన్ల టైమింగ్‌తో హీట్స్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఇమామ్ అలీ 1:05.32 సెకన్లతో చివరి స్థానంలో ఉన్నాడు. కాగా, ఎస్13 విభాగం దృష్టి లోపం ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహించే పారా స్విమ్మింగ్ కేటగిరీ.
ఇవి కూడా చదవండి:
ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్
నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ