అందుకే ఆర్ఆర్‌తో నా ప్రయాణాన్ని ముగించాను: సంజు శాంసన్
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:36 PM
భారత స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై సంజు స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై సంజు స్పందించాడు. 11 సీజన్ల పాటు రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు.. ఆ జట్టును వీడాలనే నిర్ణయం అంత సులభంగా అవ్వలేదని పేర్కొన్నాడు. అయితే కొత్త సవాళ్లను స్వీకరించాలనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన సంజు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం చాలా పెద్ద రిస్క్. ఒకసారి ఫ్రాంచైజీకి మీ నిర్ణయం చెప్పాక వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. 2025 సీజన్‌తో ఆర్ఆర్‌తో నా ప్రయాణం ముగించాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ విషయంపై నా కుటుంబంతో, ముఖ్యంగా నా భార్యతో మూడు వారాల పాటు చర్చించాను. చివరకు ఇదే సరైన నిర్ణయమని భావించా. నేను ఎప్పుడూ కొత్తగా మొదలుపెట్టడానికి సిద్ధంగానే ఉంటాను. చెపాక్ నెమ్మదైన పిచ్.. నా బ్యాటింగ్‌కు సరిపోదని చాలామంది అన్నారు. ఆ ఆలోచన నా మనసులోకి కూడా వచ్చింది. కానీ ‘నీకు ఇప్పుడు 30 ఏళ్లు. కొత్త పరిస్థితులకు తగ్గట్టు నీ ఆటను మార్చుకో’ అని నాకు నేనే చెప్పుకున్నాను. అదే ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌ను ప్రారంభించాను’ అని సంజు పేర్కొన్నాడు.
వైఫల్యాలే ఎక్కువ..
‘టీ20 క్రికెట్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి. సీఎస్కేలో తొలి మూడు మ్యాచ్‌ల్లో నేను విఫలమయ్యాను. ప్రపంచకప్ ఫైనల్ ఆడి వచ్చినా ఆ ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగించలేకపోయాను. అయినా జట్టు యాజమాన్యం, సహచరుల వైఖరిలో ఒక్క శాతం కూడా మార్పు రాలేదు. అదే నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. ప్రాక్టీస్ సమయంలో మాహీ భయ్యా నా దగ్గరకు వచ్చి 'అన్నీ బాగానే ఉంటాయి. నువ్వు నీలాగే ఆడు' అని చెప్పారు. ఆ చిన్న మాటే నాకు పెద్ద పాఠంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో మళ్లీ నా జోరు మొదలైంది’ అని సంజు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్
నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ