యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:28 PM
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సంస్థ యునిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సంస్థ యునిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించింది. బాలికల హక్కులు, భద్రత, నాయకత్వ లక్షణాలు, సమాన అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా స్మృతి ఈ కొత్త బాధ్యతలను చేపట్టనుంది.
ఈ బాధ్యతల్లో భాగంగా కౌమార దశలో ఉన్న బాలికల సాధికారత, ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె భాగస్వామి కానుంది. బాలికలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించనుంది. గతంలోనూ స్మృతి బాలల హక్కులు, లింగ సమానత్వం, జీవన నైపుణ్యాలకు సంబంధించిన యునిసెఫ్-ఐసీసీ ప్రచార కార్యక్రమాలకు మద్దతుగా నిలిచింది.
ప్రతి చిన్నారికి కలలు కనే హక్కుంది: స్మృతి
యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపిక కావడంపై స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. ఈ బాధ్యతను చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. క్రికెట్ తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, ప్రతి కల నెరవేరాలంటే మొదట అవకాశం లభించాలని పేర్కొంది. ప్రతి చిన్నారి పెద్ద కలలు కనాలని, తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకునే అవకాశం పొందాలని ఆకాంక్షించింది.
ఈ వార్తలూ చదవండి
బీసీసీఐకి గంభీర్ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!
ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు