Share News

టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:49 PM

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా బ్యాటర్‌ మ్యాట్‌ రెన్‌షా దాన్ని అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో రెన్‌షా (190) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
Matt Renshaw

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా బ్యాటర్‌ మ్యాట్‌ రెన్‌షా దాన్ని అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో రెన్‌షా (190) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2002 తర్వాత టెస్టుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీని వెనక్కి నెట్టాడు.


దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ వేదికగా జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెన్‌షా 397 బంతులు ఎదుర్కొని 190 పరుగులు చేశాడు. ఇందులో 21 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. గతంలో 2016లో ఇంగ్లండ్‌తో ముంబైలో జరిగిన టెస్టులో కోహ్లీ 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లతో కలిసి 171 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు అదే అత్యుత్తమ రికార్డుగా ఉండేది. తాజాగా రెన్‌షా తన ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లతో కలిసి 174 పరుగులు చేసి కోహ్లీ రికార్డును అధిగమించాడు.


ఆస్ట్రేలియా 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రెన్‌షా క్రీజులోకి వచ్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా సహనంతో బ్యాటింగ్‌ చేస్తూ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (43), నాథన్‌ లయన్‌ (27) అతడికి విలువైన సహకారం అందించారు. కమిన్స్‌తో కలిసి 86 పరుగుల భాగస్వామ్యంలో రెన్‌షా 41 పరుగులు చేశాడు. మిచెల్‌ స్టార్క్‌తో కలిసి 20 పరుగులు జోడించాడు. ఇక లయన్‌తో కలిసి కీలకమైన 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో రెన్‌షా ఏకంగా 100 పరుగులు చేశాడు. చివర్లో జోష్‌ హేజిల్‌వుడ్‌తో కలిసి 26 పరుగులు జోడించాడు. వీటిలో 21 పరుగులు అతడివే. ఇలా టెయిలెండర్లతో కలిసి 174 పరుగులు సాధించాడు. రెన్‌షా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది.


ఈ వార్తలూ చదవండి

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు

Updated Date - Oct 11 , 2026 | 02:52 PM