ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్.. అర్జెంటీనాను కలవరపెడుతోన్న సెంటిమెంట్!
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:46 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఆయనతో పాటు టోమాజో క్లాంక్నిక్, ఆండ్రాజ్ కోవాసిక్ అసిస్టెంట్ రిఫరీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే ఇప్పుడు అర్జెంటీనాను ఓ సెంటిమెంట్ కలవరపెడుతోంది. విన్సిచ్ రిఫరీగా ఉన్న మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమి పాలైంది. ఈ ప్రపంచ కప్‌లో నిర్వాహకులు, రిఫరీలు అర్జెంటీనాకే అనుకూలంగా ఉన్నారనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రిఫరీ కిట్ అందుకున్న సమయంలో విన్సిచ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేంటి ఆ చేదు అనుభవం..
విన్సిచ్ తన కెరీర్‌లో అర్జెంటీనా మ్యాచ్‌లకు ఎక్కువసార్లు రిఫరీగా వ్యవహరించలేదు. కానీ 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో జరిగిన ఓ మ్యాచ్ మాత్రం ఆయన రికార్డులో ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2022 నవంబర్ 22న లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా-సౌదీ అరేబియా జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ ఇచ్చారు. దానిని లియోనెల్ మెస్సి గోల్‌గా మలిచాడు. మ్యాచ్‌లో సౌదీ ఆటగాళ్లకు మొత్తం ఆరు ఎల్లో కార్డులు చూపించారు. అయితే చివరికి ఆ మ్యాచ్ అర్జెంటీనా చరిత్రలోనే ఓ షాకింగ్ పరాజయంగా నిలిచింది. తొలి అర్ధభాగంలో వెనుకబడిన సౌదీ అరేబియా రెండో భాగంలో అద్భుతంగా పుంజుకుని 2-1తో విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనాకు అది ఊహించని ఎదురుదెబ్బగా మారింది. విన్సిచ్ రిఫరీగా ఉన్నప్పుడు అర్జెంటీనా ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు మళ్లీ ఆయనే రిఫరీగా ఫైనల్ మ్యాచ్‌కు రావడం మెస్సి సేనను కలవరపెడుతోంది.
స్పెయిన్ మ్యాచ్‌ల్లోనూ కీలక బాధ్యతలు
స్పెయిన్‌కు సంబంధించిన పలు కీలక అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో తొలిసారి స్పెయిన్ మ్యాచ్‌కు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత యూరో 2020లో స్వీడన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు కూడా అంపైర్‌గా ఉన్నారు. 2023లో స్పెయిన్-ఇటలీ మధ్య జరిగిన యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ సెమీఫైనల్‌కు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. లామిన్ యమాల్ స్పెయిన్ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన తర్వాత కూడా విన్సిచ్ ఆ జట్టు మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు. యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌కు, అలాగే ఫ్రాన్స్‌తో జరిగిన సెమీఫైనల్‌కు కూడా ఆయనే రిఫరీ. అర్జెంటీనా మ్యాచ్‌ల్లో రిఫరీ నిర్ణయాలు తరచూ చర్చకు వస్తున్న నేపథ్యంలో.. న్యూయార్క్‌లో జరగనున్న ఫైనల్‌లో స్లావ్కో విన్సిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. మెస్సి సేనకు ఈసారి అదృష్టం కలిసొస్తుందా.. లేక 2022 జ్ఞాపకాలు వెంటాడుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!
మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్