ఫిఫాలో ఇంగ్లండ్- ఫ్రాన్స్ మధ్య థర్డ్ ప్లేస్ మ్యాచ్.. ఎందుకు నిర్వహిస్తారంటే..
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:23 PM
ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్‌పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్‌పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లు తలపడే ఈ మ్యాచ్‌ను కొందరు అవసరం లేని పోరుగా భావిస్తే.. మరికొందరు మాత్రం కాంస్య పతకం కోసం జరిగే ప్రతిష్ఠాత్మక పోరుగా చూస్తారు. అందుకే దీనికి ‘బ్రాంజ్ ఫైనల్’ అని పేరొచ్చింది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు జులై 18న మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో మూడో స్థానం కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్రాంజ్ ఫైనల్ ఎందుకు నిర్వహిస్తారని నెట్టింట చర్చ మొదలైంది.
అందుకే నిర్వహిస్తారు..
ప్రపంచ కప్‌లో ప్రతి అదనపు మ్యాచ్.. ఫిఫాకు టికెట్ విక్రయాలు, ప్రసార హక్కులు, ప్రకటనల రూపంలో అదనపు ఆదాయాన్ని తీసుకొస్తుంది. అలాగే సెమీఫైనల్స్, ఫైనల్ మధ్య ఉండే విరామాన్ని భర్తీ చేయడంతో పాటు అభిమానులకు మరో ఆసక్తికర పోటీని అందిస్తుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్ ఫలితం ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. గెలిచిన జట్టుకు కాంస్య పతకం మాత్రమే కాదు.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం, భవిష్యత్ టోర్నీల్లో కూడా ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది.
అలా మొదలైంది..
1934 ప్రపంచ కప్ నుంచి థర్డ్ ప్లేస్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. తొలి ప్రపంచ కప్ (1930)లో మాత్రం ఈ మ్యాచ్ లేదు. ఆ టోర్నీలో అమెరికాను గోల్ తేడా ఆధారంగా మూడో స్థానంలో నిలిచిన జట్టుగా ప్రకటించారు. 1950 ప్రపంచ కప్‌లో రౌండ్-రాబిన్ విధానం అమలు చేయడంతో ఈ మ్యాచ్ జరగలేదు. 1954 నుంచి మాత్రం ప్రతి ప్రపంచ కప్‌లో ఇది తప్పనిసరిగా కొనసాగుతోంది. అయితే ఈ థర్డ్ ప్లేస్ మ్యాచ్ విజేతకు ప్రత్యేకంగా ట్రోఫీ అంటూ ఉండదు. కానీ గెలిచిన జట్టుకు కాంస్య పతకాలు అందజేస్తారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో పోలిస్తే విజేతకు 2 మిలియన్ డాలర్లు అదనపు ప్రైజ్‌మనీ లభిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు మొత్తం 29 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 27 మిలియన్ డాలర్లు అందుతాయి.
ఎన్నో చారిత్రక రికార్డులు
థర్డ్ ప్లేస్ మ్యాచ్‌ల్లోనే ప్రపంచ కప్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. 2002లో దక్షిణ కొరియాపై టర్కీ ఆటగాడు హకాన్ షుకూర్ కేవలం 11 సెకన్లలో గోల్ చేసి ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన గోల్ నమోదు చేశాడు. అలాగే 1958 ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ దిగ్గజం జస్ట్ ఫాంటైన్ థర్డ్ ప్లేస్ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడంతో ఆ టోర్నీలో మొత్తం 13 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికీ ఒకే ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతడి రికార్డు చెక్కు చెదరలేదు.
గోల్డెన్ బూట్ రేసుపై ప్రభావం
థర్డ్ ప్లేస్ మ్యాచ్‌లో చేసిన గోల్స్ కూడా అధికారిక ప్రపంచ కప్ గణాంకాల్లోనే లెక్కిస్తారు. అందువల్ల గోల్డెన్ బూట్ పోరులో ఈ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఈసారి గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి ఎనిమిది గోల్స్‌తో ముందంజలో ఉండగా.. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కూడా ఎనిమిది గోల్స్‌తో సమానంగా ఉన్నాడు. అసిస్టుల ఆధారంగా మెస్సికి ఆధిక్యం ఉంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ తలో ఆరు గోల్స్‌తో ఉన్నారు. దీంతో థర్డ్ ప్లేస్ మ్యాచ్ గోల్డెన్ బూట్ పోరును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు.. ఎలాంటి పోటీ లేకుండానే..
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ రియాక్షన్ ఇదే!