వైభవ్ సూర్యవంశీకి ఇంత హైప్ ఇవ్వకండి: సితాన్షు కోటక్
ABN , Publish Date - Oct 23 , 2026 | 09:36 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలంటూ అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్లపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలంటూ అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్లపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. 15 ఏళ్ల కుర్రాడిపై ఇంత హైప్ సృష్టించడం అతడి ఎదుగుదలకు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రతిభ ఉన్నంత మాత్రాన జట్టులోకి తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నారని.. తుది జట్టులో 11 మందికే అవకాశం ఉంటుందని గుర్తుచేశాడు.
‘వైభవ్ ప్రతిభకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అభిమానులే కాదు జట్టులోని వారికీ అతడంటే ఇష్టమే. కానీ, ఒక ఆటగాడిని ప్రజలు ఇష్టపడుతున్నారని మాత్రమే తుది జట్టులో మార్పులు చేయలేం. వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది. నిలకడగా అవకాశాలు వస్తే మరింత నేర్చుకుంటాడు. యువ ఆటగాడిపై ఇంత హైప్ సృష్టించడం మంచిది కాదు. 15 ఏళ్ల కుర్రాడి చుట్టూ ఒత్తిడి తీసుకొస్తే.. చివరకు జట్టులో చోటు దక్కకపోతే అతడి మనసుపై ప్రభావం పడొచ్చు. అతడు ఇంకా చాలా చిన్నవాడు. ఈ హైప్‌ను నేను నియంత్రించలేను. అలా అని ప్రస్తుతం బాగా ఆడుతున్న ఇతర ఓపెనర్లను ప్రశ్నించడం కూడా సరికాదు. వాళ్లు ఎందుకు ఆడుతున్నారు? వైభవ్ ఎందుకు ఆడటం లేదు? అనే వాతావరణం సృష్టించడం ఆ ఆటగాళ్లకు అన్యాయం చేసినట్లే. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారు ఈ ప్రచారం నిజంగా యువ ఆటగాడికి ఉపయోగపడుతుందా? లేక అనవసరంగా చేస్తున్నారా? అనేది ఆలోచించాలి’ అని కోటక్ సూచించాడు.
సంజు, అభిషేక్‌ను తప్పించడం కష్టమే..
‘ఇప్పుడు వైభవ్ మరింత పరిణతి చెందాడు. జట్టులో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటున్నాడు. సంజు, అభిషేక్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో మనమంతా చూస్తున్నాం. జట్టులో ఆడేది 11 మందే. వైభవ్‌కు ఆడాలని ఉంటుంది. నేను అతడి స్థానంలో ఉన్నా ఆడాలనే కోరుకుంటాను. అందులో తప్పేమీ లేదు. కానీ వైభవ్ ఇప్పటివరకు ఆడే అవకాశం రాలేదని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆడకపోయినా అతడి వైఖరి అద్భుతంగా ఉంటుంది. ఫీల్డింగ్, ఫిట్నెస్, బ్యాటింగ్‌పై కష్టపడుతున్నాడు. సీనియర్ ఆటగాళ్ల నుంచి నిరంతరం నేర్చుకుంటున్నాడు.
వైభవ్ భారీ షాట్ల వెనుక ఉన్న ఉద్దేశం, ఆటను ఎదుర్కొనే విధానం అద్భుతంగా ఉన్నాయి. వాటిని మార్చాలని నేను అనుకోను. అతడిలో అపారమైన సామర్థ్యం ఉంది. బంతి ఎక్కడ పడుతుందనే దానిని బట్టి షాట్ ఆడాలా? లేక తనకు అనుకూలంగా షాట్‌ను సృష్టించుకోవాలా? అనే విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. వైభవ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ తనదైన శైలిలో ఆడటానికి ఇష్టపడతాడు. కొన్ని సందర్భాల్లో వేరే విధంగా ఆడితే బాగుంటుందని అనిపిస్తే చర్చిస్తాం. కానీ ఆ దూకుడుతనం లేకపోతే వైభవ్‌లో ప్రత్యేకత ఏముంటుంది! వైభవ్ భారీ షాట్లు ఆడితేనే బాగుంటుంది’ అని కోటక్ కొనియాడాడు.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ పేసర్
అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మహిళా ప్లేయర్ రిటైర్మెంట్