పారా ఆసియా గేమ్స్: భారత్‌కు రికార్డు స్థాయిలో పతకాలు.. ఏకంగా 30 స్వర్ణాలు!
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:20 PM
పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 114 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 114 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత్ 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. 2022 హాంగ్‌జౌలో సాధించిన 111 పతకాల రికార్డును అధిగమించింది. 97 పతకాలతో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఐదో స్థానంలో ఉంది. చివరి రోజైన శనివారం జరిగే ఈవెంట్స్‌లో ఆ దేశం పతకాలు సాధిస్తే.. పతకాల పట్టికలో భారత్ కొంచెం దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా 427 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్(185), ఉజ్బెకిస్థాన్(145) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పురుషుల 400 మీటర్ల టీ64 విభాగంలో సందీప్ కుమార్ 52.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్37/38 విభాగంలో హనీ అదరగొట్టాడు. 60.49 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. మహిళల లాంగ్ జంప్ టీ47 విభాగంలో భారత అథ్లెట్ నిమిషా చక్కుంగల్ పరంబిల్ 5.37 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించింది. షూటింగ్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకుంది. ఈ గేమ్స్‌లో మోనాకు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.
బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ల హవా..
పారా బ్యాడ్మింటన్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 ఫైనల్‌లో నితేశ్ కుమార్ తన సహచర ఆటగాడు ప్రమోద్ భగత్‌పై 21-18, 21-16తో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో నవీన్ శివకుమార్ ఇండోనేషియాకు చెందిన ఫ్రెడ్డి సెతియావన్‌ను 21-9, 21-17తో ఓడించాడు. 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి టైటిల్ అందుకున్నాడు. మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్, మానసి జోషి జోడీ కూడా స్వర్ణ పతకాన్ని సాధించింది. పారా ఆర్చరీలో హర్వీందర్ సింగ్, విజయ్ సుండి జోడీ సత్తాచాటింది. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో చైనాను 5-1తో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ పేసర్
అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మహిళా ప్లేయర్ రిటైర్‌మెంట్