Share News

భవిష్యత్తులో గిల్ టీ20 కెప్టెన్ అవుతాడు.. ఆసీస్ మాజీ కెప్టెన్

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:36 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్‌ క్లార్క్‌ మాట్లాడాడు.

భవిష్యత్తులో గిల్ టీ20 కెప్టెన్ అవుతాడు.. ఆసీస్ మాజీ కెప్టెన్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన శుభ్‌మన్‌ గిల్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో గిల్‌ స్థానం దక్కలేదు. కాగా యువ ప్లేయర్లు ఇషాన్‌ కిషన్‌, రింకూ సింగ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్(Shubman Gill) భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్‌ క్లార్క్‌ మాట్లాడాడు. గిల్‌ తిరిగి జట్టులోకి రావడమే కాకుండా, భవిష్యత్తులో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించే అవకాశమూ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


‘గిల్ ఇంకా పోటీలోనే ఉన్నాడు. జట్టు ఎంపికకు ఒక గడువు ఉండటం వల్లే టీ20 జట్టులో అతడిని తీసుకోలేదు. ప్రస్తుతం గిల్‌ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే భారత్‌కు ఓపెనింగ్‌ బ్యాటర్ల కొరత లేదు. ప్రస్తుతం అతడు కెప్టెన్‌ కూడా కాదు. అందుకే వరల్డ్‌ కప్‌ గెలవాలన్న ఉద్దేశంతోనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్‌ కప్‌ తర్వాత గిల్‌ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతడు అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం ఫామ్‌లో మాత్రమే లేడు. శుభ్‌మన్‌ గిల్‌ విషయంలో అతడి భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ వరల్డ్‌ కప్‌ను గెలవడమే భారత్‌ ప్రస్తుత లక్ష్యం’ అని క్లార్క్‌ స్పష్టం చేశారు.


అయితే టీ20 ఫార్మాట్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. గిల్ మళ్లీ ఫామ్ అందుకుని పరుగులు సాధిస్తే.. సులువుగా టీ20 జట్టులోకి వస్తాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

Updated Date - Jan 21 , 2026 | 04:36 PM