సూర్య ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవు: రోహిత్ శర్మ
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:17 PM
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత జట్లు ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి. నేడు నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌నూ పట్టేయాలని చూస్తోంది. అయితే.. ప్రస్తుతం అందరి ఆందోళన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ గురించే! గత 20 ఇన్నింగ్స్ నుంచి సూర్య బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాకపోవడం గమనార్హం. కెప్టెన్సీ పరంగా అజేయంగా నిలిచిన స్కై.. వ్యక్తిగతంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
‘కెప్టెన్(Suryakumar Yadav) ఫామ్‌లో ఉన్నాడా? లేడా? అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ప్లేయర్ ఫామ్‌లో లేకుంటే.. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే.. మనకున్న ప్రధాన బ్యాటింగ్ పవర్ తడబాటుకు గురైతే పరిస్థితి కఠినంగా మారుతుంది. ప్రణాళికలు, వ్యూహాలు పక్కాగా అమలు చేయడం వీలుకాదు. అనుకున్నంతగా ప్రభావం చూపడం కష్టం. ఒకవేళ సూర్య సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతే.. బ్యాటింగ్ లైనప్ కచ్చితంగా ఇబ్బంది పడుతుంది. కెప్టెన్‌గా సూర్యలో మైనస్ అంటూ ఏమీలేదు. అతడికి ఆటపట్ల ఓ అవగాహన ఉంది. తన జట్టులోని ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయర్ల ఎవరనేది అతడికి బాగా తెలుసు. వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో కూడా అతడికి తెలుసు’ అని రోహిత్ వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సన్నాహకంగా భావిస్తోన్న ఈ సిరీస్‌లో సూర్య ఫామ్ అందుకుంటాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది. సూర్య ఫామ్‌లోకి వచ్చి పరుగులు చేస్తే.. జట్టుకు విజయం లాంఛనమే అన్న ఉద్దేశంలో అభిమానులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ
లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు