Vijay Hazare Trophy: ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:12 AM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు సిక్కింతో జరగాల్సిన మ్యాచులో పంజాబ్ తరఫున స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో గిల్ తుది జట్టుకు దూరమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు కూడా భాగమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తలో రెండు మ్యాచులు ఆడారు. అయితే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున ఆడాల్సి ఉంది. జైపూర్ వేదికగా సిక్కింతో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) మ్యాచ్‌లో గిల్ ఆడతాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అప్పటి వరకు ఆడుతాడని అనుకున్న గిల్.. అనూహ్యంగా తుది జట్టులో లేడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెడ పట్టేయంతో రిటైర్డ్ హర్ట్‌గా గిల్(Shubman Gill) వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20లో తీవ్రంగా విఫలమయ్యాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ దేశవాళీల్లో అయినా రాణిస్తాడనే అంచనాలు అభిమానుల్లో భారీగా ఉన్నాయి. అంతేకాదు, ఈ మ్యాచ్ కోసం అతడు జైపూర్ చేరుకున్నాడన్న సమాచారం కూడా వెలువడింది. మ్యాచ్‌కు సుమారు 90 నిమిషాల ముందే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ‘ఎక్స్’ వేదికగా గిల్ పోస్టర్‌తో మ్యాచ్ ప్రచారం చేయడం కూడా ఆసక్తి రేపింది. అయినా, తుది జట్టులో మాత్రం గిల్ కనిపించకపోవడం కొసమెరుపు.
కారణం అదేనా?
ప్రస్తుతం గిల్ ఆడకపోవడానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ మీటింగ్‌లో గిల్ పాల్గొనే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశం ఆన్‌లైన్‌లో జరగనుందని, జట్టు ప్రకటన ఇవాళ లేదా రేపు ఉండొచ్చని సమాచారం.
ఇదిలా ఉండగా, మాంచెస్టర్ సిటీ స్టార్ ఎర్లింగ్ హాలాండ్‌తో గిల్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గిల్ ఇంకా భారత్‌కు చేరుకోలేదన్న ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. మొత్తానికి సిక్కింతో మ్యాచ్‌లో గిల్ గైర్హాజరు కావడం పంజాబ్ అభిమానుల్లో నిరాశ మిగిల్చింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!