ఇది మరో అవమానం.. గంభీర్, అగార్కర్‌లపై శశి థరూర్ ఆగ్రహం
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:51 PM
వరుసగా రెండు సిరీస్‌లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. వరుసగా రెండు సిరీస్‌లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లను ట్యాగ్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘నాలుగో టీ20 చూసిన తర్వాత నిజంగా నాకు మాటలు రావడం లేదు. భారత ప్రదర్శన చూసి షాక్‌కు గురయ్యాను. అభిమానులకు ఇది మరో అవమానం. ఇప్పుడు ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు’ అంటూ శశి థరూర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జట్టు వరుస వైఫల్యాలపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. రెండున్నరేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన శ్రేయస్ వ్యక్తిగతంగా బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నప్పటికీ, కెప్టెన్‌గా మాత్రం ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఐదింట్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు ఎంపికలు, వ్యూహాలు, నాయకత్వంపై ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం భారత జట్టు చుట్టూ నెలకొన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు