కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:31 PM
టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లపై ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లను వదిలిపెట్టకూడదని.. ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఇలాంటి ప్రవర్తనను పట్టించుకోకుండా వదిలేస్తే.. భవిష్యత్తులోనూ అదే తప్పును పునరావృతం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. భారత్-ఏ తరఫున ఆడేటప్పుడు వైభవ్ సూర్యవంశీ, ఇటీవల యశస్వి జైస్వాల్ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
‘ఇండియా-ఏ తరఫున ఆడేటప్పుడు వైభవ్ సూర్యవంశీ, తాజాగా యశస్వి జైస్వాల్.. వీరి ప్రవర్తన అస్సలు బాలేదు. ఐసీసీ, బీసీసీఐ వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. అలాంటి పని మళ్లీ చేయడానికి వారిని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఆటకు మాత్రమే కాదు.. యువ క్రికెటర్ల భవిష్యత్తుకు కూడా మంచిది కాదు’ అని సంజయ్ మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐలను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
అసలు గొడవ ఏంటంటే..?
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ముఖాముఖిగా మాటల యుద్ధం జరిగింది. ఇదే సమయంలో జైస్వాల్ హెల్మెట్ అసితకు తగిలింది. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో సహచర ప్లేయర్లు, అంపైర్లు జోక్యం చేసుకుని వారిద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. దీనిపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంది. ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు తలొక డీమెరిట్ పాయింట్ విధించింది. కాగా గత జూన్‌లో శ్రీలంక-ఏతో భారత్-ఏ జట్లు ట్రై సిరీస్ ఆడింది. వైభవ్ సూర్యవంశీ ఔటైన తర్వాత.. డకౌట్‌ను వెళ్తుంటే శ్రీలంక ప్లేయర్ విషేన్ హలమ్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన వైభవ్.. వెనక్కి వచ్చి ధీటుగా బదులిచ్చాడు. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లినంత పనైంది. అయితే వైభవ్‌తో పాటు లంక ప్లేయర్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీ ఓటమి
కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు.. ఆ ప్లేయర్లతోనూ గంభీర్‌కు గ్యాప్!