ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా
ABN , Publish Date - Aug 26 , 2026 | 02:43 PM
టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2024 ఫిబ్రవరిలో తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బుమ్రా.. దాదాపు రెండేళ్లుగా అదే స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. అయితే శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌కు బుమ్రా గాయం కారణంగా దూరమవ్వడంతో స్టార్క్‌కు కలిసొచ్చింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టార్క్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచుల్లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి తన ర్యాంకును రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. దీంతో బుమ్రా(862), న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ(861)లను వెనక్కి నెట్టి 872 పాయింట్లతో స్టార్క్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 36 ఏళ్ల స్టార్క్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది కీలక మైలురాయి. 15 ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో తన వేగంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఎన్నో ఏళ్లుగా టాప్-10లో కొనసాగుతున్నప్పటికీ నంబర్-1 స్థానాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.
మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. మెకే టెస్టులో ఆరు వికెట్లు తీసిన కమిన్స్ 841 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు స్థానాలు ఎగబాకి తిరిగి టాప్-10లోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లూ భారీగా లాభపడ్డారు. పాకిస్థాన్‌తో హెడ్డింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ కలిసి 16 వికెట్లు పడగొట్టారు. దీంతో రాబిన్సన్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరగా, టంగ్ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 17వ ర్యాంక్‌లో నిలిచాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో..
బ్యాటింగ్ విభాగంలో టాప్ స్థానాల్లో పెద్దగా మార్పులు లేవు. ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం భారీగా దూసుకొచ్చాడు. శ్రీలంకతో గాలేలో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిసిన పంత్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 711 పాయింట్లతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి సంయుక్తంగా ఏడో ర్యాంక్‌కు చేరాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా(428) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 234 పాయింట్లతో ఏడో స్థానానికి దూసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీ ఓటమి
కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు.. ఆ ప్లేయర్లతోనూ గంభీర్‌కు గ్యాప్!