కొందరు బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు.. ఎంఐ వైఫల్యాలపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:27 PM
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. గత సీజన్లలో జట్టు వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదంటూ పరోక్షంగా మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో పదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి.. 2024లో హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు అందించింది. అయితే హార్దిక్ నాయకత్వంలో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు సీజన్లలో రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. గత సీజన్లలో జట్టు వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదంటూ పరోక్షంగా మాట్లాడాడు. రోహిత్ పలు విషయాలను పంచుకున్న ఇంటర్వ్యూ వీడియో ముంబై ఇండియన్స్ ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.
‘ముంబై ఇండియన్స్ మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉండటం బాధ కలిగించింది. వాటిలో ఒకటి నా కెప్టెన్సీలో 2022లో జరిగింది. ఆ తర్వాత 2024, 2026లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ ముంబై అంటే అది కాదు. ఇన్నేళ్లుగా ముంబైకి ఉన్న గుర్తింపు ఇది కాదు. ఈ సీజన్లలో మేం సరైన రీతిలో పోటీ ఇవ్వలేకపోయాం. ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదన్నది నా బాధ కాదు. సరిగ్గా క్రికెట్ ఆడలేకపోయామన్నదే అసలైన నిరాశ. ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. కానీ కొందరు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత గత సీజన్‌పై మేమంతా నిరాశకు గురయ్యాం. నేను మాత్రమే కాదు.. చాలామంది ఆటగాళ్లు మా ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నారు. ఒక ప్లేయర్‌గా జట్టు సరిగ్గా ఆడకపోతే బాధ కలగడం సహజం. మనం బాగా ఆడకపోతే, జట్టు విజయాలు సాధించకపోతే నిరాశ చెందుతాం. గత సీజన్ తర్వాత అందరిలోనూ అదే భావన కనిపించింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడో స్పష్టత లేదు. కానీ హార్దిక్ పాండ్యకు పరోక్షంగా చురకలు అంటించాడంటూ ఎంఐ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
అంతా మారదు.. కానీ!
‘జట్టును నడిపించడం తేలికైన విషయం కాదు. బాధ్యతలు తీసుకోగానే.. అంతా మారిపోతుందని చెప్పలేను. జట్టుపరంగా సరైన ఆటతీరు ప్రదర్శించకపోతే ఓటములు తప్పవు. తప్పకుండా వచ్చే సీజన్ నాటికి జట్టును సమాయత్తం చేసి అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. కెప్టెన్సీ బాధ్యతలు నాకు అప్పగించాలని ఎంఐ మేనేజ్మెంట్ భావించినా.. నేను తొలుత అంగీకరించలేదు. కొంత సమయం కావాలని అడిగా. కానీ ఆకాశ్ అంబానీతో చర్చించిన అనంతరం ఓకే చెప్పా. ఇది నా జట్టు.. ఇందులో నేనొక భాగం. మరి నా టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరడానికి కూడా కష్టపడుతుంటే చూస్తూ ఉండలేను. నేను వచ్చాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు. కానీ ఆటతీరు మార్చుకుంటాం. వాంఖడే వంటి హోంగ్రౌండ్లో ఓడిపోయాం.. తప్పకుండా తిరిగి అభిమానులు మద్దతును సంపాదించుకుంటాం. ఇప్పుడే ట్రోఫీల గురించి ఆలోచన లేదు. ఆటను ఆస్వాదిస్తాం’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ జోరు కనిపించడం లేదు.. బుమ్రా బౌలింగ్‌పై గావస్కర్ అసంతృప్తి
న్యూజిలాండ్‌తో టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ 116/6