రోహిత్ ఇజ్ బ్యాక్.. ఇంగ్లండ్ తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే: అభిషేక్ నాయర్
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:15 PM
మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. రోహిత్ అనుభవం, ముఖ్యంగా షార్ట్ బంతులను ఎదుర్కొనే అతడి సామర్థ్యం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటుందని తెలిపాడు.
‘టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లకు షార్ట్ బంతులు ప్రధాన సవాలుగా మారాయి. కానీ రోహిత్ శర్మ అలాంటి బంతులపైనే ఎక్కువగా పరుగులు సాధిస్తాడు. విదేశీ పిచ్‌లపై, ముఖ్యంగా సేన (SENA) దేశాల్లో రాణించాలంటే పేస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం, షార్ట్ బాల్స్‌పై ఆధిపత్యం అవసరం. అది రోహిత్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలోనూ ఉంది. రోహిత్ జట్టులోకి తిరిగి రావడం వల్ల ఇంగ్లండ్ తమ బౌలింగ్ ప్రణాళికలను మార్చుకోవాల్సిందే. అగ్రశ్రేణి ఆటగాళ్ల ప్రత్యేకత ఇదే. వారు తమ ఆటతీరును మార్చుకోరు.. ప్రత్యర్థి వ్యూహాన్నే మార్చేలా చేస్తారు. రోహిత్ తిరిగి రావడం భారత్‌కు ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. పెద్ద సిరీస్‌లు, కీలక టోర్నీల్లో అతడి అనుభవం చాలా విలువైనది’ అని అభిషేక్ నాయర్ వెల్లడించాడు.
బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాలి..
గాయం తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వస్తున్న జస్ప్రీత్ బుమ్రాపై కూడా అభిషేక్ నాయర్ స్పందించాడు. సుదీర్ఘ విరామం తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు సిద్ధమవుతున్న బుమ్రా పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించాడు. ‘అనుభవం ఉన్న ఆటగాళ్లకు తమ పనిభారం ఎలా నియంత్రించుకోవాలో తెలుసు. బుమ్రా తన ఓవర్లను పర్యవేక్షిస్తూ, ఫిట్‌నెస్‌ను క్రమంగా పెంచుకుంటాడు. వన్డే క్రికెట్‌లో అతడి నైపుణ్యం అమూల్యం. ఎప్పుడు వేగం పెంచాలి.. ఎప్పుడు స్లో బంతులు వేయాలి అనేది అతడికి బాగా తెలుసు. అయితే ఈ మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రాతో అన్ని మ్యాచ్‌లు ఆడించకుండా ఉంటేనే మంచిది’ అని నాయర్ అభిప్రాయపడ్డాడు.
కుల్దీప్‌కు ఈ సిరీస్ కలిసొస్తుంది..
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పైనా నాయర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పిచ్‌లు అతడి బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందన్నారు. ‘కుల్దీప్‌కు పిచ్ నుంచి సరైన వేగం లభిస్తే అతడు చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడు. ఐపీఎల్‌లో గొప్పగా రాణించకపోయినా.. బంతి వేగాన్ని మార్చడంలో అతడు ఎంతో మెరుగయ్యాడు. ఏ స్పిన్నర్‌కైనా జట్టులో తన స్థానం ఏమిటో, తనను ఎలా ఉపయోగించుకోబోతున్నారో స్పష్టత ఉండాలి. కుల్దీప్‌కు వరుస అవకాశాలు ఇస్తే అతడు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నాను’ నాయర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్..
వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్