నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:10 PM
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో సీఎస్కేకు సంజు శాంసన్ కెప్టెన్ అవుతాడని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆ జట్టు ఏ విభాగంలోనూ రాణించడంలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి వ్యూహాల వల్లే జట్టు విజయాలు సాధించలేకపోతుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో సీఎస్కేకు సంజు శాంసన్ కెప్టెన్ అవుతాడని వెల్లడించాడు.
‘కెప్టెన్‌గా రుతురాజ్ గ్వైక్వాడ్ చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఇటు వ్యక్తిగత ఆట కూడా ఆశించిన స్థాయిలో లేదు. నాయకత్వ పటిమ ప్రభావంతంగా లేదు. దీంతో సంజు శాంసన్ సీఎస్కే జట్టు పగ్గాలను అందుకోవడం ఖాయం. నేనేమీ జ్యోతిష్యుడిని కాదు కానీ.. నా అంచనా ప్రకారం ఇది ఎప్పుడైనా జరగొచ్చు. సంజు విషయంలో నేనొక్కటే ఆశిస్తున్నా.. అతడు ఎవరిమాదిరిగానో ప్రయత్నించకూడదు. ఎవరి వారసత్వాన్ని భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదు. సంజు స్వతహాగా పనిచేస్తే చాలు’ అని అశ్విన్ విశ్లేషించాడు.
ఆయుశ్ విషయంలో భయంగా ఉంది..
‘ఆయుశ్ మాత్రే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తీవ్రంగానే గాయపడ్డాడు. మళ్లీ తిరిగి వస్తాడని ఆశిస్తున్నా. అయితే అతడిని చూస్తుంటే.. కొన్ని మ్యాచులకు దూరం అవుతాడని కాస్త భయంగా అనిపిస్తోంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సమయానికే మోకాలికి పట్టీలు ఉన్నాయి. గత రెండు మూడు మ్యాచుల నుంచి ఇంపాక్ట్ సబ్‌గా బరిలోకి దిగాడు. అతడి గాయం ఆందోళనకరమే. నొప్పిగా ఉన్నప్పుడే మైదానం వీడాల్సింది. కానీ మాత్రే మరొక బంతిని ఎదుర్కొని ఔటయ్యాడు. ఫిజియో వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేదు. అతడిని రిటైర్డ్ ఔట్‌గా ఎందుకు పంపిచలేదో అర్థం కాలేదు. ఆయుశ్ మాత్రే ఇప్పుడున్న సీఎస్కేలో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్. అయితే జట్టులో ఇంజూరీ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదు. గతంలోనూ దీపర్ చాహర్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాడు. సీజన్ ప్రారంభం అవ్వకముందే ఇంజూరీ మేనేజ్‌మెంట్ యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అశ్విన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవివత్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!