చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:33 PM
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి అతడి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి అతడి పదవీకాలం ముగియనుంది. అయితే అతడి నేతృత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శనలు చేయడంతో అజిత్ పదవీకాలం పొడగించాలని బీసీసీఐ యోచిస్తోన్నట్టు సమాచారం. అగార్కర్ హయాంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీలను టీమిండియా కైవసం చేసుకుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో స్థిరత్వం కోసం అజిత్ అగార్కర్‌నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించినట్టు సమాచారం.
‘అజిత్ అగార్కర్ హయాంలో టీమిండియాలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. పరివర్తన దశను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేసింది. నిర్భయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడనే పేరుంది. అందుకే బోర్డు అతడిని కొనసాగించాలని చూస్తోంది. ఐపీఎల్ సమయంలోనే ఈ విషయంపై బీసీసీఐ ప్రతినిధులు అతడితో చర్చించే అవకాశం ఉంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
సూర్య పరిస్థితేంటో?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యను.. రానున్న 2028లో కెప్టెన్‌గానే ఉండస్తారా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు సూర్య నాయకత్వంలోనే వెళ్లనుంది. ఈ రెండు సిరీస్‌ల్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తేనే 2028 ఒలింపిక్స్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌కు అతడే సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి ప్రదర్శన ఆధారంగానే ఆయా మెగా ఈవెంట్లకు జట్టు ఎంపిక ఉండబోతోందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు
మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్