Share News

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:15 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డ్‌ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించింది. ఆ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డ్‌ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించింది. అతికష్టం మీద కాబో వెర్డ్‌పై 3-2 తేడాతో అర్జెంటీనా గెలిచింది. కాబో వెర్డ్‌ ఆటతీరు ఫుట్‌బాల్ అభిమానులనే కాదు.. క్రీడా ప్రపంచాన్ని కూడా ఆకట్టుకుంటుంది. రౌండ్ ఆఫ్ 32లో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ.. ఆ దేశ ప్లేయర్లపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.


‘కాబో వెర్డ్‌.. ఇకపై ఏం జరిగినా.. ఈ పేరును మాత్రం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచ కప్‌లో ఆ జట్టు చూపించిన పోరాట పటిమ, ప్రదర్శన అద్భుతం’ అంటూ అశ్విన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అశ్విన్ పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అరంగేట్ర ప్రపంచ కప్‌లోనే కాబో వెర్డ్‌ అంచనాలకు మించి రాణించింది. యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్‌ను గోల్స్ లేకుండా నిలువరించడంతో పాటు సౌదీ అరేబియా, ఉరుగ్వేతో డ్రా చేసుకుని నాకౌట్ దశకు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 32లో స్టార్ ప్లేయర్ మెస్సి సారథ్యంలోని అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చింది. 3-2 తేడాతో ఓడి టోర్నీ నిష్క్రమించినా.. తమ పోరాట పటిమతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.


గోల్‌తో మెస్సినే ఆశ్చర్యపర్చాడు..

అర్జెంటీనాతో మ్యాచ్‌లో కాబో వెర్డ్‌ ప్లేయర్ లోపెస్ కబ్రాల్ వేసిన గోల్ ఫుట్‌బాల్ ప్రపంచాన్నే మంత్రముగ్ధులను చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్లనే వణికించిన ఈ గోల్‌ను ‘గోల్ ఆఫ్ ది టోర్నమెంట్’గా అభివర్ణిస్తున్నారు. తొలి భాగంలో మెస్సి గోల్‌తో అర్జెంటీనా ఖాతా తెరిచింది. అనంతం గంట మార్క్‌కు సమీపంలో డెరోయ్ డువార్డే గోల్ చేసి కాబో వెర్డ్‌కు సమం చేశాడు. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో ముగియడంతో మ్యాచ్ అదనపు సమయానికి చేరుకుంది.


ఎక్స్‌ట్రా టైమ్ ప్రారంభమైన వెంటనే లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొద్ది నిమిషాలకే సిడ్నీ లోపెస్ కబ్రాల్ అద్భుతమైన రాకెట్ షాట్‌ను టాప్ కార్నర్‌లోకి పంపి స్కోరును 2-2తో సమం చేశాడు. కబ్రాల్ కొట్టిన ఈ గోల్‌కు మెస్సి సహా అర్జెంటీనా ఆటగాళ్లు సైతం క్షణం పాటు విస్తుపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి మెస్సి తీసిన కార్నర్‌ను క్రిస్టియన్ రొమెరో హెడ్డర్‌గా మలచగా, బంతి డినే బోర్జెస్‌కు స్వల్పంగా తాకి స్వీయ గోల్‌గా మారింది. అదే అర్జెంటీనాకు 3-2 తేడాతో విజయాన్ని అందించింది.


ఇవి కూడా చదవండి:

ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది: దీప్తి శర్మ

భారత్‌పై విజయం.. మా స్థాయిని పెంచింది: ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

Updated Date - Jul 04 , 2026 | 02:40 PM