Share News

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:04 AM

ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో విజయం సాధించింది. కేప్ వెర్డెతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచింది. 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది.

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..
Argentina vs Cape Verde

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో విజయం సాధించింది. కేప్ వెర్డెతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచింది. 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది. అదనపు సమయం వరకు సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాకు పసికూన అయిన కేప్ వెర్డె గట్టి పోటీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది (Argentina vs Cape Verde).


మ్యాచ్ 29వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాకు 1-0తో ఆధిక్యం అందించాడు. ఈ గోల్‌తో మెస్సీ.. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 20 గోల్స్ చేసిన తొలి పురుష ఫుట్‌బాల్ ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు (Messi 20th World Cup goal). అయితే కేప్ వెర్డె ఆటగాడు డెరాయ్ డుర్తే 59వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు.


నిర్ణీత 90 నిమిషాల్లో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 91వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ అర్జెంటీనాకు మరోసారి ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత వెర్డే ఆటగాడు లొపెస్ కబ్రాల్ అద్భుత గోల్‌తో మరోసారి స్కోరును 2-2గా మార్చాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.


111వ నిమిషంలో మెస్సీ అందించిన అద్భుతమైన పాస్‌ను క్రిస్టియన్ రొమెరో హెడ్డర్‌గా మలిచాడు (FIFA World Cup 2026). ఆ బంతి కేప్ వెర్డె ఆటగాడు డినే బోర్జెస్‌ను తాకి గోల్‌లోకి వెళ్లింది. ఆ గోల్ అర్జెంటీనాకు విజయాన్ని అందించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించిన కేప్ వెర్డె టీమ్‌కు ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియాపై గెలిచిన ఈజిప్ట్, ఘనాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కొలంబియా ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

Updated Date - Jul 04 , 2026 | 11:42 AM