Share News

ఆ రెండు జట్లు టాప్‌లో ఉండటానికి వారిద్దరే కారణం: పుజారా

ABN , Publish Date - Apr 24 , 2026 | 06:54 PM

ఐపీఎల్ 2026లో యువ ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కుర్రాళ్ల విధ్వంసంపై ఆసక్తికర విశ్లేషణ చేశాడు.

ఆ రెండు జట్లు టాప్‌లో ఉండటానికి వారిద్దరే కారణం: పుజారా
Cheteshwar Pujara

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కుర్రాళ్ల విధ్వంసంపై ఆసక్తికర విశ్లేషణ చేశాడు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు వీరి వల్లే అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించాడు.


‘వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 ఏళ్లు. ప్రపంచంలోనే మేటి బౌలర్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టే ధైర్యం అతడిలో ఉంది. ప్రియాంశ్ ఆర్య దూకుడుగానే ఆడుతాడు. కానీ క్రీజులో పాతుకుపోవడానికి కాస్త టైం తీసుకుంటాడు. ఒక్కసారి నిలదొక్కుకున్నాడంటే అతడిని ఆపడం ఎవరి వల్ల కాదు. కేవలం బ్యాట్ ఊపేసి బౌండరీలు బాదేయాలనే ఉద్దేశంలో వీరు లేరు. కుర్రాళ్లలో ఓ క్లారిటీ ఉంది. ఈ వయసులో చాలా మంది ప్లేయర్లు జట్టులో తమ స్థానం కోసం శ్రమిస్తుంటే.. వీరు మాత్రం ఎలా ఆడాలో ముందే నిర్ణయించుకుని బరిలోకి దిగుతున్నారు. వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి విధ్వంసం సృష్టిస్తే.. ప్రియాంశ్ ఆర్య స్థిరంగా ఆడుతూ మెల్లగా గేమ్‌ను తమ వైపు తిప్పేసుకుంటాడు. వీరిద్దరూ పవర్ ప్లే అర్థాన్నే మార్చేశారు. ఇది బాధ్యత లేని ఆట కాదు.. తమపై తాము నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ఆడే ఆట. కుర్రాళ్లు ధైర్యంగా ఆడుతున్నారు’ అని పుజారా వివరించాడు.


ఇదిలా ఉండగా, వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి 254 పరుగులు చేశాడు. ప్రియాంశ్ ఆర్య ఐదు ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. కాగా ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్

మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!

Updated Date - Apr 24 , 2026 | 07:01 PM