వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:53 PM
వన్డే ప్రపంచ కప్ 2027కి సంబంధించిన తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఏడాది అక్టోబర్ 4న ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027కి సంబంధించిన తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఏడాది అక్టోబర్ 4న ప్రారంభం కానున్నట్లు సమాచారం. నవంబర్ 21న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ఫైనల్ సమయంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న వీరిద్దరికీ.. 2027 వన్డే ప్రపంచ కప్ చివరి అంతర్జాతీయ టోర్నీ అయ్యే అవకాశం ఉన్నట్లు చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అనధికారికంగా వన్డే ప్రపంచ కప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో.. రో-కో అంతర్జాతీయ క్రికెట్ ఆడే టైమ్‌లైన్ ఫిక్స్ అయిపోయిందనే చర్చ మొదలైంది.
అదే జరిగితే..?
ప్రస్తుతం విరాట్‌కు 37 ఏళ్లు, రోహిత్‌కు 39 ఏళ్లు.. వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమవ్వడంతో మరో ఏడాదిన్నర పాటు అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించగలరా? అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకూ కొనసాగాలని అనుకుంటే ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌పైనా వీరిద్దరు దృష్టి పెట్టాలి. ఇప్పటికే కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనలతో జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడానికే మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో రో-కో ఫామ్‌లో లేకపోయినా.. ఫిట్‌గా లేకపోయినా జట్టులో స్థానం కోల్పోక తప్పదు. వన్డే ప్రపంచ కప్ కల నెరవేర్చుకోవాలంటే రో-కో తీవ్రంగా శ్రమించాల్సిందే.
వన్డే ప్రపంచ కప్ 2027కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్న ఈ టోర్నీలో 41 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా వేదిక కానుండగా.. జింబాబ్వేలో 10, నమీబియాలో 3 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు సమాచారం. 2003 తర్వాత దక్షిణాఫ్రికాలో పురుషుల వన్డే ప్రపంచ కప్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో తొలి ఐసీసీ ఈవెంట్‌గా ఈ ప్రపంచ కప్ నిలవనుంది.
ఇవీ చదవండి:
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత