టీ20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు..
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:08 PM
ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పురుషుల క్రికెట్ మాత్రమే క్రేజ్ ఉండేది. అయితే కాలం మారి.. ప్రస్తుతం మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా మహిళా క్రికెట్ టోర్నీలకు సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చింది. తాజాగా మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ నగదు బహుమతిని ఐసీసీ ఊహించని రేంజ్‌లో పెంచింది.
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో ఛాంపియన్‌గా నిలిచి టైటిల్ గెలుచుకునే జట్టుకు ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ.22 కోట్లు) నగదు బహుమతి లభించనుంది. అలాగే రన్నరప్‌గా నిలిచే జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11 కోట్లు) అందజేయనున్నారు. ఫైనల్ చేరిన జట్లకే కాకుండా టోర్నీలో ఆడే ప్రతి జట్టుకూ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ఐసీసీ. ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే మొత్తం 12 జట్లకు ఒక్కో జట్టుకు 247,500 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) పార్టిసిపేషన్ బహుమతి కింద అందనుంది.
దీనితో పాటు సెమీఫైనల్స్ వరకు వచ్చిన జట్లకు కూడా తలా రూ.6.56 కోట్ల చొప్పున భారీ నగదు దక్కనుంది. మహిళా క్రికెటర్లను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఐసీసీ ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు ఈసారి జరిగే టోర్నీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా నిలవనుంది. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం 12 జట్లు ఈ మెగా సమరంలో పోటీపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియన్ ఓపెన్: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
బంగ్లాదేశ్ సంచలనం.. ఆసీస్‌పై తొలి సిరీస్ విజయం