ఎవరూ గాయపడాలని కోరుకోరు.. ఫిట్‌నెస్‌పై వస్తోన్న విమర్శలకు నితీశ్ రెడ్డి కౌంటర్
ABN , Publish Date - Oct 24 , 2026 | 09:18 PM
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చాడు. గాయాలు ఆటలో భాగమేనని, ఎవరూ కావాలని గాయపడరని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చాడు. ఆధునిక క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించడం అంత సులభం కాదని స్పష్టం చేశాడు. గాయాలు ఆటలో భాగమేనని, ఎవరూ కావాలని గాయపడరని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో నితీశ్ కుమార్ రెడ్డి(26*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన నితీశ్.. తన ఫిట్‌నెస్, పని భారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. గాయాలు ఆటలో భాగం. నేను ఆల్‌రౌండర్‌ను అనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్లలో కూడా నా పనిభారం ఎక్కువగానే ఉంటుంది. మైదానంలోనూ, బయటా ఇతర ఆటగాళ్లతో పోలిస్తే నేను మరింత శ్రమించాల్సి వస్తుంది. ప్రస్తుతం దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటున్నా. ఎవరూ గాయపడాలని కోరుకోరు. భారత జట్టుకు ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక్కో రోజును ఒక్కో సవాల్‌గా తీసుకుంటున్నా. మరుసటి రోజు కూడా జట్టు తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉంటే అది మంచి సంకేతం. గాయాలు కాకూడదనే ఆశిస్తున్నా’ అని నితీశ్ తెలిపాడు.
బౌలింగ్‌లోనూ మెరుగవుతున్నా..
‘ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తున్నా. ఇదంతా అనుభవానికి సంబంధించిన విషయం. ఎక్కువగా బౌలింగ్ చేస్తూ అనుభవం సంపాదించాలి. సరైన సమయం వచ్చినప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతున్నా. ఇక్కడ న్యూజిలాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రత్యేకంగా శ్రమిస్తున్నా. మ్యాచ్‌కు ముందు రోజు ఐచ్ఛిక సాధనకు హాజరైన కొద్దిమంది భారత ఆటగాళ్లలో నేనూ ఒకడిని. మాకు ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ లభించింది. పిచ్ గురించి కూడా పెద్దగా సమాచారం లేదు. తొలి మ్యాచ్ ఆడిన తర్వాత మరింత సాధన చేయాలని అనిపించింది. అందుకే ఐచ్ఛిక ప్రాక్టీస్‌కు వచ్చా. భారత్‌తో పోలిస్తే ఇక్కడి పిచ్ భిన్నంగా ఉంటుంది. బంతి బౌన్స్ కూడా బాగుంటుంది’ అని నితీశ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు