ఇకపై వాంఖడే స్టేడియం ఎంఐ జెర్సీలతోనే కనిపించాలి: పొలార్డ్
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:22 PM
ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పొలార్డ్.. కీలక వ్యా్ఖ్యలు చేశాడు. వాంఖడే స్టేడియం మొత్తం ముంబై ఇండియన్స్ నీలి రంగు జెర్సీలతో కళకళలాడేలా చేయాలని అభిమానులకు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒకప్పుడు వాంఖడే స్టేడియం అడ్డాగా ఉండేది. సొంత మైదానంలో ఆ జట్టు ఆడుతుంటే అభిమానుల సందడి మామూలుగా ఉండేది కాదు. అయితే ఇటీవలి సీజన్లలో పరిస్థితి మారిపోయింది. ముంబై మ్యాచ్‌లు జరుగుతున్నా.. స్టేడియంలో ప్రత్యర్థి జట్ల అభిమానుల హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల నినాదాలు వాంఖడేలో వినిపిస్తున్నాయి. ముంబై ఫ్రాంచైజీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పొలార్డ్ ఈ విషయంపై స్పందించాడు. మళ్లీ స్టేడియం మొత్తం ముంబై ఇండియన్స్ నీలి రంగు జెర్సీలతో కళకళలాడేలా చేయాలని అభిమానులకు సూచించాడు.
‘ముందుగా జట్టులో పాత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని తీసుకురావడమే నా లక్ష్యం. వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు ఎరుపు, పసుపు రంగు జెర్సీలు కనిపించకూడదు. ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ జెర్సీలు, బ్లూ కలర్ జెండాలు రెపరెపలాడాలి. అభిమానుల్లో ఎంఐపై ఉన్న అభిమానం, ఉత్సాహం మళ్లీ కనిపించాలి. అభిమానుల్లో ఆ ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలంటే ముందుగా మేమే మంచి ప్రదర్శన చేయాలి. మేము ఎవరి కోసం ఆడుతున్నాం? ఏ లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాం? అనే విషయాలను అర్థం చేసుకోవాలి. గత కొన్నేళ్లుగా మేము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యర్థి జట్లు మాతో ఆడినప్పుడు గతంలో ముంబై ఇండియన్స్ ఎలా ఉండేదో గుర్తుచేసుకునేలా మా ఆట ఉండాలి. అది చరిత్రే కావచ్చు. కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే కొన్నిసార్లు గతాన్ని గుర్తుచేసుకోవాలి. మా పునరాగమనం అక్కడి నుంచే మొదలవుతుంది’ అని పొలార్డ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు