టీ20 ప్రపంచ కప్: కివీస్‌కే ఎందుకిలా? వీళ్ల గతి మారేదెన్నడో!
ABN , Publish Date - Mar 09 , 2026 | 07:47 PM
టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా సగర్వంగా కప్పును ముద్దాడింది. ఎక్కడ చూసినా భారత జట్టు సంబరాలు, అభిమానుల కేరింతలు, ప్రముఖుల అభినందనలు! మరి రన్నరప్‌గా నిలిచిన ‘న్యూజిలాండ్’ గురించి మాట వరుసకు కూడా ఎవ్వరూ ప్రస్తావించడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా సగర్వంగా కప్పును ముద్దాడింది. ఎక్కడ చూసినా భారత జట్టు సంబరాలు, అభిమానుల కేరింతలు, ప్రముఖుల అభినందనలు! మరి రన్నరప్‌గా నిలిచిన ‘న్యూజిలాండ్’ గురించి మాట వరుసకు కూడా ఎవ్వరూ ప్రస్తావించడం లేదు. గెలిచిన వారి ఆనందం ముందు ఓడిన వారి బాధ ఎవ్వరికీ పట్టదనే దానికి ఇదే నిదర్శనం. పది సార్లు టీ20 ప్రపంచ కప్‌లో తలపడితే.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడే అవకాశం రాలేదు. కివీస్‌కే ఎందుకిలా? అజేయంగా ఫైనల్ వరకు చేరకుని ఆఖరి మెట్టుపై బోల్తా పడే ఈ కివీస్ గతి ఎన్నడు మారుతుందో!
కప్పు దగ్గరికి వచ్చి.. చేజారిన చరిత్ర
ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌కు ఇది కొత్త కథ కాదు. నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఘనత వారిది. 2019 ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో దురదృష్టం వెంటాడి ఓడినప్పుడు అయ్యో కివీస్ అనుకున్నారంతా. కానీ మిగతా మూడు మ్యాచుల్లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేస్తూ వస్తోంది. పోరాడి నిలిచి ఫైనల్ వరకు చేరినా.. అందినట్టే అంది ట్రోఫీ మాత్రం ఆమడదూరం వెళ్లిపోతూ వస్తోంది. కివీస్ మరో ‘చోకర్స్’లా మిగిలిపోతారా? అనే సందేహం ప్రతి అభిమానిలో మెదులుతుంది. ‘భారత అభిమానులను స్టేడియంలో సైలెంట్ చేస్తాం.. కప్పు కొడుతాం’ అని మ్యాచ్‌కు ముందు శాంట్నర్ అన్నప్పటికీ.. అదే ప్రతి భారత అభిమాని టీమిండియాతో పాటు కివీస్‌నూ ప్రోత్సహిస్తూ వచ్చారు. వాళ్లు ఓడితే భారత అభిమానులు బాధ పడిన రోజులూ ఉన్నాయి.
గత స్మృతులు ఇలా..
2015 వన్డే ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.
2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరిత పోరులో సూపర్ ఓవర్ వరకు వెళ్లి కూడా ట్రోఫీ చేజారింది.
2021 టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియాకు తలవంచింది.
ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది.
పోరాటమే వారి గుర్తింపు..
న్యూజిలాండ్ జట్టు ప్రత్యేకత ఏమిటంటే.. ఓటమి వచ్చినా తలవంచి నిలబడదు. ఓ టీమ్‌గా, క్రమశిక్షణతో ఆడటం వారి సంస్కృతి. ప్రపంచ క్రికెట్‌లో ‘జెంటిల్‌మెన్ టీమ్’గా కూడా కివీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచ కప్‌లలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ న్యూజిలాండ్‌కు టీ20 ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం ఇంకా దక్కలేదు. ప్రతి టోర్నీలో పోరాడుతూ ఫైనల్ దాకా రావడం వారి సామర్థ్యానికి నిదర్శనం. 2026 ఫైనల్ ఓటమి కివీస్ అభిమానులను నిరాశపరిచినా.. జట్టు చూపించిన పోరాటం మాత్రం ప్రశంసనీయం. కొత్త తరం ఆటగాళ్లతో న్యూజిలాండ్ భవిష్యత్తులో మరోసారి ట్రోఫీ కోసం గట్టిగా పోరాడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్