వైస్ కెప్టెన్ అయినా జట్టులో చోటు గ్యారంటీ కాదు.. తిలక్ వర్మకు కైఫ్ వార్నింగ్
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:29 PM
భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పసికూన ఐర్లాండ్‌పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పసికూన ఐర్లాండ్‌పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నంత మాత్రాన జట్టులో స్థానం శాశ్వతం కాదని హెచ్చరించాడు. మంచి ప్రదర్శన చేయకపోతే ఎవరినైనా తప్పించే ధైర్యం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉందని స్పష్టం చేశాడు.
‘తిలక్ వర్మ వైస్ కెప్టెన్ కావచ్చు. కానీ ఆ బాధ్యతల కారణంగా తుది జట్టులో స్థానం ఖాయం కాదు. గతంలో కూడా వైస్ కెప్టెన్లను జట్టు నుంచి తప్పించారు. ఆ బాధ్యతల వల్ల జట్టులో తన స్థానం సురక్షితమని తిలక్ భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిందే. లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. దీనికి అక్షర్ పటేల్ ప్రత్యక్ష ఉదాహరణ. అక్షర్ పటేల్ ఇటీవల ఫామ్‌ను ఆధారంగా చేసుకునే.. అతడి స్థానంలో తిలక్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రతి ప్లేయర్ తమ ప్రదర్శనతోనే జట్టులో చోటు సంపాదించుకోవాలి’ అని కైఫ్ స్పష్టం చేశాడు.
గంభీర్ కఠిన నిర్ణయాలు..
‘గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. స్టార్ ప్లేయర్లు కూడా ప్రతి మ్యాచ్‌లోనూ తమను తాము నిరూపించుకోవాల్సిందే. మేనేజ్‌మెంట్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు’ అని కైఫ్ అన్నాడు. తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్-భారత జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. మరి పసికూన ఐర్లాండ్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్
వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..