Share News

ఆఖరి బంతికి సిక్స్ .. హీరోగా నిలిచిన భారత సంతతి క్రికెటర్

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:55 PM

మేజ‌ర్ లీగ్ క్రికెట్2026లో మ‌రో సంచ‌ల‌న చోటుచేసుకుంది. టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడ‌మ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది.

ఆఖరి బంతికి సిక్స్ .. హీరోగా నిలిచిన భారత సంతతి క్రికెటర్

స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా సాగే మ్యాచుల్లో ఏ జట్టైన విజయం సాధిస్తే...ఆ క్రెడిట్ ఆటగాళ్లందరికీ చేరుతుంది. అయితే ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో మాత్రం ఎవరు గెలిపిస్తే వారు హీరోగా మారుతారు. అలానే భారతి సంతతి క్రికెటర్ కూడా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్2026లో హీరోగా నిలిచాడు. టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడ‌మ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. భార‌త సంత‌తికి చెందిన నిఖిల్ చౌద‌రీ (27*) ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి వాషింగ్టన్ ఫ్రీడ‌మ్‌ను గెలిపించాడు.


మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూప‌ర్‌కింగ్స్ 20 ఓవ‌ర్లలో 4 వికెట్ల కోల్పోయి 185 ప‌రుగులు చేసింది. డొనోవ‌న్ ఫెరీరా (44*), వియాన్ ముల్డర్ (43 *) మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. టెక్సాస్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే సాయితేజ ముక్కామ‌ల్ల 37 పరుగులతో రాణించాడు. వాషింగ్టన్ బౌల‌ర్లలో నిఖిల్ చౌద‌రీ 2 వికెట్లు సాధించాడు. ఫెర్గూస‌న్‌, మార్కో జాన్సెస్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.


అనంత‌రం 186 ప‌రుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ ఆఖ‌రి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెన‌ర్లు మిచెల్ ఓవెన్ (77) అర్ధ సెంచరీతో రాణించాడు. ఓవెన్, స్టీవ్ స్మిత్ (30) తొలి వికెట్‌ కేవలం 7.5 ఓవర్లలోనే 91 పరుగులు జోడించారు. 8వ ఓవర్‌లో స్మిత్ ఔట్ కావడంతో ఫ్రీడమ్ బ్యాటింగ్ పతనం మొదలైంది. ఆ తర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వాషింగ్టన్ ఒత్తిడిలో ప‌డింది.


ఒక ద‌శ‌లో 91-1తో ప‌టిష్ఠంగా క‌నిపించిన ఆ జట్టు ల‌క్ష్యానికి చేరువ‌య్యే కొలదీ వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. అద్భుతంగా బౌలింగ్ చేసిన హొసెన్.. తొలి బంతికి పరుగులేమీ ఇవ్వకపోగా.. తర్వాతి మూడు బంతుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. దీంతో వాషింగ్టన్‌ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇక టెక్సాస్ విజయం ఖాయమని అనుకున్నారంతా. ఈ ద‌శ‌లో నిఖిల్ చౌద‌రీ ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచి టెక్సాస్ జ‌ట్టుకు ఓటమి మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో హొసెన్ 4 వికెట్లు తీయ‌గా, ఆడ‌మ్ మిల్నే, వియాన్ ముల్డ‌ర్‌లు చెరో 2 వికెట్లతో రాణించారు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన నిఖిల్ చౌద‌రీ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.


ఎవరీ నిఖిల్?

ఇక నిఖిల్ చౌదరి విషయానికి వస్తే.. అతడు ఢిల్లీలో జన్మించగా.. పూర్వికులు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారు. మొదట ఫాస్ట్ బౌల‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఆ త‌ర్వాత ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. మరికొంతకాలం తర్వాత లెగ్ స్పిన్నర్‌గా త‌న బౌలింగ్‌ను మార్చుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ జ‌ట్టుకు ఎంపికైన నిఖిల్ చౌద‌రీ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన రెండో భార‌త సంత‌తి క్రికెట‌ర్‌గా నిఖిల్ చౌద‌రీ రికార్డు సృష్టించాడు.


ఇవి కూడా చదవండి:

జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్

వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..

Updated Date - Jun 28 , 2026 | 03:16 PM