Share News

ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:45 PM

ఫిఫా ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు చేరాలన్న ఇరాన్ కల చివరి క్షణంలో ఛిద్రమైంది. అయితే తమ దేశానికి వెళ్లే ముందు ఇరాన్ ప్లేయర్లు లాకర్ రూమ్‌లో ఓ లేఖ రాసి వదిలి వెళ్లారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతోంది.

ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!
Iran FIFA World Cup

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు చేరాలన్న ఇరాన్ కల చివరి క్షణంలో ఛిద్రమైంది. గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌ను ఇరాన్ 1-1తో ముగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రియా-అల్జీరియా మ్యాచ్ ఫలితంపై ఆశలు పెట్టుకున్న ఇరాన్‌కు అదృష్టం కలిసి రాలేదు. ఆ ఇరు జట్లలో ఏదొక జట్టు గెలిస్తే ఇరాన్ నాకౌట్‌కు చేరేది.. కానీ ఆస్ట్రియా-అల్జీరియా తమ మ్యాచ్‌ను 3-3తో సమం చేసింది. దీంతో ఇరాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ దేశానికి వెళ్లే ముందు ఇరాన్ ప్లేయర్లు లాకర్ రూమ్‌లో ఓ లేఖ రాసి వదిలి వెళ్లారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతోంది.


‘ఎన్నో ఏళ్లుగా విజయాల కంటే గౌరవమే గొప్పదిగా భావించే నేల నుంచి వచ్చాం. మా దృష్టిలో ఫుట్‌బాల్ కేవలం ఫలితాల కోసం జరిగే పోటీ కాదు.. అది ప్రతి ఒక్కరి వ్యక్తిత్వానికి పెట్టే పరీక్ష. పాయింట్లు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ గౌరవాన్ని మాత్రం నిజాయతీగానే గెలుచుకోవాలి. గ్రూప్ దశలోనే నిష్క్రమించడం బాధగానే ఉంది. అయినప్పటికీ మేము మా దేశానికి తలెత్తుకుని వెళ్తున్నాం. చరిత్రలో మాకంటూ ఓ పేజీ సృష్టించుకున్నాం. ఫెయిర్ ప్లే అనేది ఫుట్‌బాల్ నిబంధనల్లోని ఓ వాక్యం మాత్రమే కాదు.. అది ఈ ఆటకు జీవం లాంటిది. ఈ టోర్నీలో మాకు అండగా నిలిచిన ప్రతి ఇరానీయుడికి కృతజ్ఞతలు. ఇరాన్ ఎప్పటికీ తలెత్తుకునేలానే జీవిస్తుంది’ అని ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంగా లేఖ రాసి లాకర్ రూమ్‌లో వదిలి వెళ్లారు.


చివరి క్షణంలో చేజారిన అవకాశం..

గ్రూప్-జీలో ఉన్న బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్‌లతో ఇరాన్ వరుసగా మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అయితే ఆస్ట్రియా-అల్జీరియా మ్యాచ్‌లో ఒక్క జట్టు గెలిస్తే.. ఇరాన్ నాకౌట్‌కు చేరేది. అల్జీరియా అదనపు సమయంలో 3-2తో ఆధిక్యంలోకి వెళ్లిన క్షణంలో ఇరాన్‌ నాకౌట్‌కు అర్హత ఖాయమైనట్టే కనిపించింది. కానీ చివరి బంతికి ఆస్ట్రియా గోల్‌ చేసి మ్యాచ్‌ను సమం చేయడంతో ఇరాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఏడు ప్రపంచ కప్‌ టోర్నీల్లో పాల్గొన్న ఇరాన్‌.. ఈసారి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయినప్పటికీ నాకౌట్ దశకు చేరుకోలేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.


రాజకీయ పరిస్థితుల ప్రభావం

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ జట్టుకు టోర్నీలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మెక్సికోలో బస చేసిన జట్టు.. అమెరికాలో జరిగిన ప్రతి మ్యాచ్‌కు అక్కడి నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో మ్యాచ్‌కు 24 గంటల ముందు మాత్రమే అమెరికాలోకి ప్రవేశించి మ్యాచ్‌ ముగిసిన వెంటనే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి మ్యాచ్‌కు ముందు ఈ నిబంధనల్లో కొంత సడలింపు ఇచ్చినా.. అప్పటికే జట్టుపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్

వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..

Updated Date - Jun 28 , 2026 | 02:56 PM