Mohammad Kaif: విరాట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినా.. ఫ్యాన్స్ బాధపడుతున్నారు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:18 AM
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్‌పై అభిమానులకున్న అంచనాల గురించి మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 91 బంతులు ఎదుర్కొని 93 పరుగులు చేసిన విరాట్.. తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ సూపర్ నాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో 93 పరుగులు చేశాడన్న ఆనందాన్ని పక్కన పెట్టి సెంచరీ చేయలేదనే బాధే అభిమానుల్లో ఎక్కువగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) వెల్లడించాడు.
‘మ్యాచ్ సందర్భంగా ఓ పిల్లాడు గ్రౌండ్‌లో ప్లకార్డు పట్టుకున్న ఫొటో తెగ వైరల్ అయింది. దాని మీద.. ‘కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేయకపోతే నేను వారం పాటు అన్నం తినను’ అని రాసి ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తావన రాగానే.. అభిమానులు సెంచరీ గురించే చర్చిస్తున్నారు. ఇది కోహ్లీపై అభిమానులకున్న అంచనాలను సూచిస్తోంది. కోహ్లీ 93 పరుగులు సాధించాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ సెంచరీ చేయలేకపోయాడనే బాధ పడుతున్నారు’ అని కైఫ్ అన్నాడు.
సుందర్ బ్యాటింగ్‌కి ఎందుకొచ్చాడు..
న్యూజిలాండ్‌తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) బ్యాటింగ్‌కు రాకుండా ఉండాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేశాడు. ‘మీకు గుర్తుందా.. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ గాయపడినప్పుడు, అతడు బ్యాటింగ్ చేయడానికి రాలేదు. అది చాలా హైస్కోరింగ్ గేమ్. ఆ మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్‌కు వచ్చి 20 నుంచి 30 పరుగులు చేసినా టీమిండియా గెలిచి ఉండేదని అభిమానులు భావించారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అతడి విషయంలో రిస్క్ తీసుకోలేదు. కానీ వాషింగ్టన్ సుందర్ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరిగింది. అది సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. అతడి వల్ల వికెట్ల మధ్య కేఎల్ రాహుల్ పరుగులపై ప్రభావం పడింది. సుందర్ సరిగా పరిగెత్తలేకపోవడం వల్ల 2 రన్స్ రావాల్సిన చోట సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, వాషింగ్టన్ గాయం పెద్దదయ్యే ప్రమాదముంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు