Share News

Alyssa Healy: షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:00 AM

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. రానున్న టీ20 ప్రపంచ కప్ ముంగిట హీలీ ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Alyssa Healy: షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
Alyssa Healy

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. రానున్న టీ20 ప్రపంచ కప్ ముంగిట హీలీ(Alyssa Healy) ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి-మార్చి 2026లో భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ ఆమెకు చివరిదని హీలీ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.


‘ఇది చాలా రోజులుగా మనసులో ఉన్న నిర్ణయమే. గత కొన్ని సంవత్సరాలు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసిపోయాను. గాయాలు కూడా వెంటాడాయి. పోటీ తత్వం పూర్తిగా తగ్గకపోయినా, కొంత తగ్గినట్లు అనిపించింది. రానున్న భారత సిరీస్‌లో నేను చివరిసారిగా ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ కనిపిస్తాను. నాకు ఇప్పటికీ ఆస్ట్రేలియా తరఫున ఆడాలనే ఉంది. కానీ ప్రారంభం నుంచీ నన్ను ముందుకు నడిపించిన పోటీతత్వాన్ని నేను ఇప్పుడు కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని అలీసా అంది.


‘నేను టీ20 జట్టులో లేను. కాబట్టి భారత్‌తో టీ20 సిరీస్‌లో నేను ఆడటం లేదు. కానీ.. నేను నా కెరీర్‌ను టెస్ట్‌, వన్డే కెప్టెన్‌గా స్వదేశంలో భారత్‌తో ఆడుతూ ముగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్‌లో మాకు ఇది పెద్ద సిరీస్’ అని ఆమె అన్నారు. ఫిబ్రవరి 15 నుంచి భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డేలు, పెర్త్‌ వేదికగా 1 టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది.


రిటైర్‌మెంట్ తర్వాత..

2025 వన్డే ప్రపంచకప్ సమయంలో హీలీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయం తనపై తీవ్ర ప్రభావం చూపిందని హీలీ తెలిపింది. ‘రిటైర్మెంట్ నిర్ణయం బాధ కలిగించలేదు. క్రికెట్‌ కంటే జీవితం చాలా పెద్దదనే దృష్టి కోణం నాకు ఎప్పుడూ ఉంది. మార్చి తర్వాతి జీవితం పట్ల ఆసక్తిగా ఉన్నాను’ అని అలీసా చెప్పుకొచ్చింది.


ఆస్ట్రేలియాకు 8 సార్లు ప్రపంచకప్‌లు అందించిన ఘనత హీలీది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్‌లు, 2018, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆమె కీలక పాత్ర పోషించింది. స్వదేశంలో భారత్‌తో చివరి పోరుతో ఒక దిగ్గజ క్రికెటర్ తన కెరీర్‌కు ఘన ముగింపు ఇవ్వనుంది.


ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 10:06 AM